కరోనా వైరస్ ధాటికి ప్రపంచమంతా స్తంభించిపోయింది. అన్ని ఆఫీసులూ మూతపడ్డాయి. డాక్టర్లు, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులు.. వీళ్లు మాత్రమే తమ కార్య క్షేత్రాల్లో పని చేస్తున్నారు. మిగతా వాళ్లందరూ పనులు మానేశారు. లేదంటే ఇంటి నుంచి పని చేస్తున్నారు. సినీ పరిశ్రమ విషయానికి వస్తే చాలామంది పని లేక ఖాళీగా ఉన్నారు. కొంతమంది వీలు చేసుకుని ఖాళీ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రచయితలు, దర్శకులు కథల మీద కసరత్తు చేస్తుంటే హీరోలు ఫిట్నెస్ మీద దృష్టిపెడుతున్నారు. అలాగే కొత్త కథలు వింటున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న సినిమాలకు సంబంధించి వాటి మేకర్స్ షూటింగ్ అయిన రషెస్ వరకు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసే పనుల్లో పడ్డారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘వకీల్ సాబ్’ టీం కూడా ఈ పనిలోనే నిమగ్నమైంది. చిత్రీకరణ చాలా వరకు అయిపోవడంతో దాని వరకు డబ్బింగ్, రీరికార్డింగ్, ఇతర ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి ఈ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుంటోంది. ఇందులో పవన్ కళ్యాణ్ సైతం భాగం అవుతున్నట్లు సమాచారం. ఆయన ఈ సినిమాలో పూర్తయిన తన పార్ట్ వరకు డబ్బింగ్ కానిచ్చేస్తున్నారట.
డబ్బింగ్ సెటప్ అంతా ఇంటికి తెప్పించుకుని అస్టిస్టెంట్ డైరెక్టర్ల సాయంతో డబ్బింగ్ అవగొడుతున్నాడట పవన్. మళ్లీ షూటింగ్ మొదలయ్యే సమయానికి ప్రస్తుత రషెస్ మొత్తానికి చిత్ర బృందంలో అందరూ డబ్బింగ్ పూర్తి చేసేయనున్నారట. తమన్ రీరికార్డింగ్, పాటల పని కూడా దాదాపుగా పూర్తి చేసేస్తాడని సమాచారం. ఎడిటింగ్, డీఐ పనులు కూడా చురుగ్గా సాగుతున్నట్లు తెలిసింది.
కరోనా దెబ్బ.. పవన్ వర్క్ ఫ్రమ్ హోమ్
Gulte Telugu Telugu Political and Movie News Updates