అన్ని రంగాల్లోనే సినిమా ఫీల్డు కూడా కరోనా ధాటికి కుదేలైంది. ఆరు నెలలుగా సినీ కార్యకలాపాలన్నీ ఆగిపోయి ఉన్నాయి. షూటింగ్‌లు జరగట్లేదు. సినిమాల పోస్ట్ ప్రొడక్షన్లు నడవట్లేదు. థియేటర్లు మూతపడి ఉన్నాయి. దీంతో సినిమాను నమ్ముకున్న వేలాది కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. జూనియర్ ఆర్టిస్లుల దగ్గర్నుంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ ఇబ్బంది పడ్డవాళ్లే.
ఇంతకుముందు కొంచెం ఖరీదైన జీవితం గడిపిన వాళ్లు కూడా లాక్ డౌన్ టైంలో కష్టాలు ఎదుర్కొన్నారు. ఇక కింది స్థాయి వాళ్ల పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సీసీసీ ద్వారా కొంత సాయం అందింది కానీ.. వాటితో అన్ని అవసరాలూ తీరలేదు. ఆ సాయం తీసుకోవడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చి ఆగిపోయిన వాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్లంతా సినిమాల షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని చూశారు.
రెండు నెలల కిందటే షూటింగులకు అనుమతులు వచ్చినప్పటికీ కరోనా విలయం చూసి హీరోలు, దర్శకులు, నిర్మాతలు షూటింగ్‌కు ముందుకు రాలేదు. ఐతే ఇప్పుడు ఉద్ధృతి కొంచెం తగ్గడం, భయం కూడా తగ్గడంతో ఇంకెంతో కాలం షూటింగ్‌లు ఆపొద్దని ఇండస్ట్రీ జనాలు నిర్ణయించుకున్నారు. సెప్టెంబరు రెండో వారంలో ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడం ఆలస్యం.. మిగతా చిత్రాల బృందాల్లోనూ కదలిక వచ్చింది.
దాని కంటే ముందే కొన్ని సినిమాలు మళ్లీ సెట్స్ మీదికి వెళ్లిపోయాయి. అందులో సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రం ఒకటి. అలాగే అక్కినేని నాగార్జున సినిమా ‘వైల్డ్ డాగ్’ షూటింగ్‌ను కూడా సైలెంటుగా పున:ప్రారంభించినట్లు తెలుస్తోంది. యువ కథానాయకుడు సందీప్ కిషన్ కూడా ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రీకరణ మొదలుపెట్టేశాడు. చిరంజీవి, బాలయ్య సైతం మళ్లీ షూటింగ్‌కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చిత్రాల బృందాలు ఈ వారంలో షూటింగ్ పున:ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. దీంతో ఇండస్ట్రీ మళ్లీ ఫుల్ స్పీడ్ అందుకోబోతున్నట్లే. సినీ జనాల కడుపులు నిండబోతున్నట్లే.