వచ్చే గురు శుక్రవారాల్లో సలార్ వర్సెస్ డంకీ పోటీ పట్ల బాక్సాఫీస్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. తెలుగు రాష్ట్రాల వరకు ప్రభాస్ మేనియాకు ఎలాంటి ఢోకా లేకపోయినా నేషన్ వైడ్ చూసుకుంటే పరిస్థితి అంత సులభంగా ఉండదు. ట్రెండ్స్ చూస్తే సలార్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఓవర్సీస్ డామినేషన్ మరీ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న డంకీ పంపిణి చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లతో షారుఖ్ ఖాన్ తన రెడ్ చిల్లీస్ తరఫున ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళతో కొన్ని కీలక విషయాలు పంచుకున్నాడు. సాయంత్రం డిన్నర్ కూడా ఏర్పాట్లు చేసి మరీ ముచ్చట్లు చెప్పాడు.
దానికి హాజరైన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం షారుఖ్ ఖాన్ ప్రధానంగా ప్రస్తావించిన విషయం అడ్వాన్స్ బుకింగ్స్, ట్రెండ్స్, పబ్లిక్ టాక్ ని బట్టి న్యాయంగా రెండు సినిమాలకు ఎన్ని షోలు వేయాలనేది చూసుకోమని నొక్కి చెప్పాడట. ముందస్తు అగ్రిమెంట్లతో భాగంగా ఎవరికి వారు విడిగా థియేటర్లను బ్లాక్ చేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందనేది ప్రత్యక్షంగా తాము గమనించలేం కాబట్టి పారదర్శకంగా ఉండాలని కోరినట్టు సమాచారం. క్లాసు మాస్ అని విభజించకుండా ప్రేక్షకులు ఏ సినిమాని ఎక్కువ డిమాండ్ చేస్తున్నారనేది గమనించుకోవాలని పలు సూచనలు చేసినట్టు తెలిసింది.
దీన్ని బట్టి డంకీ మీద బజ్ ఏ స్థాయిలో ఉందో షారుఖ్ కి అర్థమయినట్టు ఉంది. ఒకవేళ సలార్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే కనక తక్కువ స్క్రీన్లు అందుబాటులో ఉండే బిసి సెంటర్లతో తన సినిమాకు చిక్కొస్తుందని అవగతం చేసుకునే ఈ కామెంట్లు చేసినట్టు అర్థమవుతోంది. అలా అని నా సినిమానే ఆడాలనే ధోరణి చూపించలేదని పార్టీకి వెళ్లిన బయ్యర్ల టాక్. ఇదంతా ఎలా ఉన్నా జవాన్, పఠాన్ విషయంలో పాటించిన దూకుడు షారుఖ్ ఈ డంకీకి చూపించడం లేదు. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ సలహా మేరకు ముందు లో ప్రొఫైల్ పాటించి 21 తర్వాత ప్రమోషన్లు ఉదృతం చేద్దామని నిర్ణయించుకున్నారట.