చందూ అరెస్టుతో టైసన్ నాయుడు ఆందోళన

టాలీవుడ్ లో ఎన్నడూ లేనిది సపోర్టింగ్ ఆర్టిస్టుల అరెస్టులు పెద్ద సినిమాలకు తలనెప్పిగా మారుతున్నాయి. ఇటీవలే పుష్ప నటుడు జగదీశ్ ఓ అమ్మాయి ఆత్మహత్యకు కారణమైన కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. బెయిలు మీద బయటికి తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్టు టాక్ ఉంది. దీని కోసం పదిహేను లక్షలకు పైగా ఖర్చు పెడుతున్నారని వినిపిస్తోంది. ఎంత వరకు నిజమో లోగుట్టు పెరుమాళ్ళకెరుక. తాజాగా యూట్యూబర్, షార్ట్ ఫిలింస్ సెలబ్రిటీ చందూ అలియాస్ చంద్రశేఖర్ సాయి కిరణ్ పలు అభియోగాల మీద అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది.

ఇతను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేస్తున్న సినిమాలో హీరో పక్కనే ఉండే కీలక పాత్ర చేస్తున్నాడు. భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా నిర్మాణం గత ఆరేడు నెలలుగా జరుగుతోంది. 14 రీల్స్ బ్యానర్ పై రూపొందుతోంది. బడ్జెట్ కూడా భారీగా పెడుతున్నారు. చందూ పాపులారిటీ చూసి సాగర్ మంచి క్యారెక్టర్ ఇస్తే ఇప్పుడీ కుర్రాడేమో ఏకంగా చీటింగ్ అండ్ రేప్ కేసులో ఇరుక్కున్నాడు. సెక్షన్లు కూడా బెయిలు సులభంగా రాలేనంత కఠినంగామోపబడి ఉన్నాయి. జగదీష్, చందూ ఇద్దరూ అమ్మాయిలను మోసం చేసిన నేరంలోనే భాగమయ్యారు.

ఈ మూవీకి టైసన్ నాయుడు టైటిల్ ని దాదాపు ఫిక్స్ చేసుకున్నారు. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ రిజిస్టర్ చేసుకున్న మాట వాస్తవం. ఏవో సమస్యల వల్ల ఇప్పటికే పలు బ్రేకులు వేసుకుంటూ వచ్చిన నాయుడుకి ఇదో కొత్త చిక్కొచ్చి పడింది. ఛత్రపతి హిందీ రీమేక్ కోసం విలువైన మూడేళ్ళ కాలాన్ని పోగొట్టుకున్న సాయి శ్రీనివాస్ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. తీరా చూస్తేనేమో ఇలా వరస అడ్డంకులు. అయినా చిన్న నటులు మంచి కెరీర్ దక్కినప్పుడు అవకాశాలను సద్వినియోగపరుచుకుని పైకెక్కడం గురించి ప్లాన్ చేసుకోవాలి కానీ ఇలా పాతాళం వైపు పరుగులు పెడితే ఎవరు మాత్రం ఏం చేయగలరు.