నాని.. ఇలా కూడా తగ్గేదేలే

నేచురల్ స్టార్ నాని అంటే పక్కా క్లాస్ హీరో అని ముద్ర ఉంది. అతడి కెరీర్లో మెజారిటీ సినిమాలు క్లాస్ టచ్ ఉన్నవే. వాటిలో చాలా వరకు మంచి విజయం సాధించాయి కూడా. అయితే తనకు మాస్ సినిమాలు సెట్ కావు అనే అనే అభిప్రాయం ఒక భ్రమ మాత్రమే అని ఎంసీఏ, దసరా చిత్రాలతో నాని రుజువు చేశాడు.

ముఖ్యంగా దసరాకు వచ్చిన ఓపెనింగ్స్, ఓవరాల్ వసూళ్లు చూసి ట్రేడ్ పండిట్లు కూడా షాక్ అయ్యారు. అలాంటి ఊర మాస్ సినిమా తర్వాత నాని తన శైలిలో హాయ్ నాన్న అనే ఎమోషనల్ చేశాడు. ఈ సినిమాకు దసరా తో పోలిస్తే అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్లుగా జరిగాయి. దీంతో ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ మీద సందేహాలు నెలకొన్నాయి. టాక్ బాగున్నా సరే అనుకున్న స్థాయిలో వసూళ్లు ఉంటాయా అన్న చర్చ జరిగింది.

అయితే మాస్ సినిమా అయినా క్లాస్ సినిమా అయినా తన బాక్సాఫీస్ స్టామినా వేరని నాని చాటి చెప్పాడు. హాయ్ నాన్న లాంటి పక్కా క్లాస్ మూవీతో.. యానిమల్ పోటీని తట్టుకుని మరి బాక్స్ ఆఫీస్ దగ్గర తన చిత్రానికి మంచి కలెక్షన్లు రాబడుతున్నాడు. ఐదు రోజుల్లోనే హాయ్ నాన్న ప్రపంచవ్యాప్తంగా 44 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు తెచ్చుకుంది. కేవలం యుఎస్ లో మాత్రమే ఈ చిత్రం 1.2 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టి 1.5 మిలియన్ డాలర్ల మార్కు వైపు అడుగులు వేస్తోంది. హాయ్ నాన్న ఓవరాల్ గ్రాస్ వసూళ్లు 60 కోట్ల మార్కును అందుకునే పరిస్థితి కనిపిస్తోంది. షేర్ 35- 40 కోట్లు రావచ్చు. ఇలాంటి సినిమాతో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం నాని బాక్సాఫీస్ స్టామినాకు నిదర్శనం.