డిసెంబర్ 15 చిన్న సినిమాలకే అంకితం

ఇంకో పదకొండు రోజుల్లో సలార్, డంకీల రిలీజ్ ఉండటం కేవలం వారం రన్ కోసం పెద్ద నిర్మాతలు ఎవరూ సాహసం చేయడం లేదు. అందుకే డిసెంబర్ 15 ఈసారి పూర్తిగా చిన్న చిత్రాలకు అంకితం కాబోతోంది. హారర్ ఎలిమెంట్స్ విపరీతంగా భయపెడతాయని చెబుతున్న ‘పిండం’ నిర్మాతలు దానికి తగ్గట్టే ప్రమోషన్లు చేస్తున్నారు. స్టార్ క్యాస్టింగ్ లాంటి ఆకర్షణలు లేనప్పటికీ ట్రైలర్ కట్ ద్వారా అంతో ఇంతో దెయ్యాల ప్రియుల అటెన్షన్ తీసుకు రాగలిగారు. బేబీతో పేరు తెచ్చుకున్న విరాజ్ అశ్విన్ సోలో హీరోగా రూపొందిన ‘జోరుగా హుషారుగా’తో కామెడీ లవర్స్ ని టార్గెట్ చేసుకున్నారు.

ఇవి కాకుండా తికమక తాండ, చేగు లాంగ్ లైఫ్, కలశ కూడా బరిలో దిగుతున్నాయి. వీటిలో దేని మీద భారీ అంచనాలు, ప్రత్యేక ఆసక్తి ఆడియన్స్ లో లేవు. టాక్ మీద ఆధారపడాల్సిందే. అటు హిందీ నుంచి నోటెడ్ రిలీజులు ఏమి లేవు. ఆపై వారం ఆక్వా మెన్ ఫాలెన్ కింగ్ డం ఉండటంతో ఇంగ్లీష్ మేకర్స్ సైతం ఈ వారాన్ని అనాథగా వదిలేశారు. సో మూవీ లవర్స్ కి ఎదురు చూపులు తప్పవు. ఒకవేళ ఇక్కడ చెప్పిన వాటిలో ఏవైనా అనూహ్యంగా టాక్ తెచ్చుకుంటే తప్ప థియేటర్లకు వెళ్లే పనుండదు. గతంలో ఈ డేట్ లాక్ చేసుకున్న ధనుష్ కెప్టెన్ మిల్లర్ సంక్రాంతికి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

ఈ లెక్కన హాయ్ నాన్నకు మరో గోల్డెన్ వీక్ దక్కినట్టే. యానిమల్ వీకెండ్ డామినేషన్ కొనసాగవచ్చు. ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ మాత్రం ఎలాంటి ఆశలు పెట్టుకోవడానికి లేకుండా పోయింది. ప్రభాస్, షారుఖ్ లు వచ్చే దాకా డిస్ట్రిబ్యూటర్లకు ఇవే ఆధారం కానున్నాయి. ఒకవేళ పిండం, జోరుగా హుషారుగా లేదా మిగిలిన మూడింట్లో ఏదైనా పర్వాలేదనిపించుకున్నా మరీ కలెక్షన్లు హోరెత్తిపోయేంత సీన్ ఉండదు కానీ ఉన్నంతలో శని ఆదివారం క్యాష్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదో పెద్ద నిర్మాతల అండ ఉంటే తప్ప చిన్న సినిమాలు జనాలను థియేటర్లకు రప్పించడం సవాల్ గా మారిపోయింది.