నిఖిల్ సమస్యే కళ్యాణ్ రామ్ ఎదుర్కోవాలి

కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన డెవిల్ ఈ నెల 29 విడుదలకి రెడీ అయిపోయింది. అధికారిక ప్రకటన వచ్చేసింది. రేపు ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. అయితే హీరో వైపు నుంచి దీని అనౌన్స్ మెంట్ కి సంబంధించి ఎలాంటి ట్వీట్ లేకపోవడం అభిమానుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. దర్శకుడు నవీన్ మేడారం పేరు మాయమై నిర్మాత అభిషేక్ నామానే డైరెక్టర్ కార్డు వేసుకోవడం పట్ల ఆల్రెడీ అంతర్గత రభస జరిగిపోయింది. ఇప్పుడు చూస్తేనేమో హఠాత్తుగా డేట్ లాక్ చేసుకుని ఆఘమేఘాల మీద ప్రకటన ఇచ్చేసి బిజినెస్ లు మాట్లాడుతున్నారు.

నిజానికీ ఈ డేట్ కళ్యాణ్ రామ్ కి ఇష్టం లేదని ఇన్ సైడ్ టాక్. సలార్, డంకీలు వచ్చిన వారానికే విడుదలంటే థియేటర్ల సంగతి అటుంచి ఆ రెండింటిలో ఒకదానికి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే దాని ముందు అంత తక్కువ గ్యాప్ లో నిలవడం కష్టమని భావిస్తున్నాడట. పైగా వచ్చే పది రోజులు సోషల్ మీడియాతో సహా ఎక్కడ చూసినా షారుఖ్ ఖాన్, ప్రభాస్ సినిమాల గురించిన వార్తలే హైలైట్ అవుతుంటాయి. వాటి మధ్యలో డెవిల్ పబ్లిసిటీ చేసుకోవడం అంత సులభం కాదనేది తన అభిప్రాయంగా చెప్పాడట. అభిషేక్ నామా మాత్రం ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ మార్చి దాకా ఖాళీ లేని విషయాన్ని నొక్కి చెబుతున్నారు.

గతంలో ఇలాంటి సమస్యే నిఖిల్ స్పై టైంలో వచ్చింది. కొన్ని రిపేర్లు అవసరమైనా నిర్మాత ఒత్తిడి వల్ల డెడ్ లైన్ కి లోబడి దాని ప్రమోషన్లకు ముందు విముఖత చూపి ఆ తర్వాత పాల్గొన్నాడు. ఫలితం కూడా తేడాగా రావడంతో తను ఫీలయ్యిందే నిజమయ్యిందని వాపోయాడు. కానీ డెవిల్ మీద యూనిట్ నుంచి వస్తున్న టాక్ ని బట్టి చూస్తే పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మంచి టైంలో వస్తే బ్లాక్ బస్టర్ ఖాయమని అంటున్నారు. కానీ డిసెంబర్ 29 నుంచి కేవలం జనవరి 10 వరకే టైం ఉంటుంది ఆలోగానే వసూళ్లు లాగేయాలి. సంక్రాంతి హడావిడి మొదలయ్యాక డెవిల్ సైడ్ ఇవ్వక తప్పదు.