ఇంకో పది రోజులు గడవటం ఆలస్యం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ థియేటర్లలో అడుగు పెడుతుంది. కానీ ఇప్పటిదాకా ప్రమోషన్ పరంగా పెద్దగా సౌండ్ లేకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపే సూచనలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. అలాంటి ఉద్దేశం ఏదైనా ఉంటే ఈపాటికే వేదికను డిసైడ్ చేసుకుని అనుమతులు గట్రా తీసేసుకోవాలి. కానీ హైదరాబాద్ లో అలాంటి వినతులేవి పోలీస్ శాఖకు, ప్రభుత్వానికి ఇప్పటికైతే రాలేదు. బెంగళూరు, చెన్నైలోనూ సేమ్ సీన్. కొత్త ట్రైలర్ కట్ చేయించారట కానీ ఖచ్చితంగా వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి.
కంటెంట్ మీద నమ్మకం ఉండటం మంచిదే. కానీ దాన్ని సరైన రీతిలో జనం దాకా తీసుకెళ్తే అద్భుతాలు జరుగుతాయి. యానిమల్ విషయంలో ఏం జరిగిందో చూస్తున్నాం. ఎంత ప్రభాస్ ఉన్నా సరే ఆ బ్రాండ్ ఓపెనింగ్ మూడు రోజుల వరకే పని చేస్తుంది. తర్వాత మాట్లాడాల్సింది సినిమానే. ఆదిపురుష్, రాధే శ్యామ్ లకు జరిగింది ఇదే. దర్శకుడు ప్రశాంత్ నీల్ అడపాదడపా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కానీ పూర్తి కిక్ ఇచ్చే మెటీరియల్ ఏదీ బయటికి రాలేదు. పైగా కెజిఎఫ్ తరహాలో ఉందనే డివైడ్ కామెంట్స్ కి సరైన సమాధానం చెప్పాలంటే ఇంకో వెర్షన్ వదలాలి.
అంచనాలు కాసింత అదుపులో పెట్టేందుకే హోంబాలే ఫిలిమ్స్ ఈ కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతోందని కొందరు ఫ్యాన్స్ సమర్థిస్తున్నారు కానీ అది లాజిక్ కాదు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ కోసం నెల రోజులకు పైగా రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు దేశమంతా తిరిగారు. అంత చేస్తేనే ఇండియా వైడ్ గ్రాండ్ ఓపెనింగ్ దక్కింది. కానీ సలార్ కు మరీ ఇంత టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా ఉండకూడదనేది ఫ్యాన్స్ వాదన. షారుఖ్ ఖాన్ డంకీ మీద సైతం విపరీతమైన బజ్ లేకపోయినా దాన్ని తక్కువంచనా వేయడానికి లేదు. వీలైనంత త్వరగా సలార్ టీమ్ గేర్ మార్చడం చాలా అవసరం.