సీనియర్ హీరోలకు ఏదైనా ఫ్లాష్ బ్యాక్ పెట్టినప్పుడు వాళ్ళ వయసు తగ్గించేందుకు దర్శక నిర్మాతలు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. టెక్నాలజీ వాడి ఏవో తిప్పలు పడతారు కానీ చాలా సందర్భాల్లో ఇవి తేడా కొడుతుంటాయి. ఆచార్యలో చిరంజీవి, టైగర్ నాగేశ్వరరావులో రవితేజలు ఇలా ప్రయోగం చేయబోయి దెబ్బ తిన్నారు. అయితే ఇక్కడ రాజీ పడని బడ్జెట్ చాలా అవసరం. దాన్ని ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్ దొరికినప్పుడు చేసుకోవచ్చు. గత కొన్నేళ్లుగా తెలుగులోనూ మంచి మార్కెట్ సంపాదించుకున్న విజయ్ కొత్త సినిమా కోసం అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని వాడబోతున్నారు.
దీని కోసం అక్షరాలా 6 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారట. కథ ప్రకారం విజయ్ కాసేపు 19 సంవత్సరాల యువకుడిగా కనిపించాలి. డీ ఏజింగ్ టెక్నిక్ అవసరం. విదేశీ నిపుణులు దీని కోసం పని చేయబోతున్నారు. నాగ చైతన్యకి కస్టడీ రూపంలో అల్ట్రా డిజాస్టర్ ఇచ్చిన వెంకట్ ప్రభు ఈ విజయ్ 68కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటిదాకా విజయ్ చేసిన రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కొత్త ట్రీట్ మెంట్, స్క్రీన్ ప్లే దీన్ని తీయబోతున్నట్టు తెలిసింది. కొంత భాగం ఆల్రెడీ పూర్తయిపోయింది. దీని తర్వాత విజయ్ రాజకీయాల్లోకి వస్తాడనే టాక్ బలంగా తిరుగుతోంది.
స్కై ఫై జానర్ లో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి ఇంకా టైటిల్ ప్రకటించలేదు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చబోతున్నాడు. మానాడు తరహాలో ఇది కూడా లూప్ తరహాలో ఉంటుంది కానీ టైం ట్రావెల్ మూవీ కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎంఆర్ కాలంలో అరవై వయసు దాటాక కూడా శ్రీదేవి లాంటి కుర్ర హీరోయిన్ల పక్కన డాన్సులు చేస్తే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది. జోడి ఏ మాత్రం కుదరకపోయినా ట్రోలింగ్ కి పని చెబుతున్నారు. అందుకే విజయ్ విషయంలో అలాంటి కామెంట్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు.