రజనీ పరువుని ఎందుకయ్యా తీస్తారు

రీ రిలీజుల ట్రెండ్ అరిగిపోయిందని ఇటీవలే వచ్చిన కొన్ని సినిమాలు రుజువు చేశాక కూడా కొందరు డిస్ట్రిబ్యూటర్ల ఆలోచనా ధోరణి మారడం లేదు. మొన్న డిసెంబర్ 2న సూపర్ స్టార్ రజనీకాంత్ ముత్తుని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు తెగ హంగామా చేసిన సంగతి గుర్తే. తీరా యానిమల్ సునామిలో దాన్నెవరూ పట్టించుకోకపోవడంతో దాదాపు అన్ని చోట్ల షోలు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో తిరిగి ఎప్పుడు వదులుతారో పైవాడికే తెలియాలి. సరే ఇక్కడితో కథ అయిపోలేదు. డిసెంబర్ 12 రజని పుట్టినరోజు సందర్భంగా శివాజీని ప్లాన్ చేసి ఆర్భాటంగా పబ్లిసిటీ కూడా చేశారు.

ఇప్పుడది కూడా వాయిదా పడింది. నిజానికి ప్రేక్షకుల్లో పాత సినిమాలు మళ్ళీ థియేటర్లలో చూడాలన్న మోజు తగ్గిపోయింది. కొత్త టికెట్ రేట్లతో పదే పదే చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో గత రెండు మూడు నెలల్లో వచ్చిన శంకర్ దాదా ఎంబిబిఎస్, అదుర్స్ లాంటివి ఒకటి రెండు చోట్ల తప్ప చాలా సెంటర్స్ లో కనీస ఓపెనింగ్స్ తేలేదు. శివాజీకి ఇంతకన్నా దారుణమైన పరిస్థితి తలెత్తే అవకాశం కనిపించడంతో ప్రస్తుతానికి డ్రాపయ్యారు. అయినా ఇలా ప్రకటించడం ఎందుకు, మళ్ళీ లేదని తూచ్ చెప్పడం ఎందుకని రజని తెలుగు అభిమానుల ప్రశ్న.

ఇక్కడ ఇలా ఉంటే మనల్ని చూసి తమిళనాడులో ఈ ట్రెండ్ ని మొదలుపెట్టారు. నిన్న రజని ముత్తు, కమల్ హాసన్ అభయ్, అనుష్క అరుంధతిలను రీ రిలీజ్ చేశారు. ఆశించినంత భారీ స్పందన లేదు కానీ ఉన్నంతలో డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి. అయినా ఓటిటి, యూట్యూబ్ లో ఉచితంగా దొరుకుతున్న సినిమాలను ఇలా పదే పదే పనిగట్టుకుని రుద్దే కార్యక్రమాన్ని కొన్ని నెలల పాటు వాయిదా వేస్తే మంచిది. లేదంటే క్లాసిక్స్ ని బిగ్ స్క్రీన్ మీద చూసే అవకాశం వృథా అయిపోతుంది. ఏదైనా మితంగా ఉంటేనే బాగుంటుంది. అతి అయితే ఇలాగే బంగారు బాతుని చంపిన కథ గుర్తొస్తుంది.