కేవలం ఇంకో 15 రోజుల్లో సలార్ విడుదల కానుంది. డార్లింగ్ ఫ్యాన్స్ ఉద్వేగం అంతకంతా పెరుగుతుండగా ట్రైలర్ కు వచ్చిన మిశ్రమ స్పందన ఇంకో వెర్షన్ కట్ చేసేందుకు ప్రేరేపించింది. డిసెంబర్ మూడో వారంలో దాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ అసలైన హీరో ప్రభాస్ ఇంకా బయటికి రావడం లేదు. చికిత్స కోసం విదేశాలకు వెళ్లి రెండు వారాల క్రితమే వచ్చి విశ్రాంతిలో ఉన్నాడు కానీ సలార్ ప్రమోషన్లను మొదలుపెట్టాల్సిన టైం వచ్చింది. ఇండియా వైడ్ ఈవెంట్స్ చేయాలంటే కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ పరిగెత్తాలి. కానీ ప్రస్తుతానికి ఆ సూచనలు లేవు.
అంతర్గతంగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రభాస్ నూటికి నూరు శాతం పూర్తిగా సెట్ బ్యాక్ అవ్వలేదు. ఇంకొంత విశ్రాంతి తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చని డాక్టర్లు చేసిన సూచన మేరకు బయట కనిపించడం లేదని తెలిసింది. ఈ కారణంగానే ఇటీవలే తెలంగాణ ఎన్నికల రోజున స్టార్లలో పోలింగ్ బూత్ దగ్గర కనిపించనిది ఒక్క ప్రభాస్ మాత్రమే. మరీ ఇబ్బందిగా ఉంటే తప్ప వచ్చి ఉండడనేది సన్నిహితుల మాట. మరి విపరీతమైన బజ్ తో అంతో ఇంతో నెగటివిటీని కూడా మూటగట్టుకున్న సలార్ కి బజ్ పెరగాలంటే ప్రత్యేకంగా పబ్లిసిటీ మీద దృష్టి పెట్టాలి.
వివిధ నగరాల్లో ప్రెస్ మీట్లు, అభిమానులతో ఫోటో షూట్లు, మీడియాకు వీడియో ఇంటర్వ్యూలు, ఏదైనా పబ్లిక్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా బోలెడు వ్యవహారాలు సలార్ ముందున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులను విపరీతమైన ఒత్తిడి మధ్య చేసుకుంటున్న సలార్ బృందం వచ్చే వారం పది రోజుల్లో సెన్సార్ ఫార్మాలిటి పూర్తి చేయాలి. ఓవర్సీస్ కి హార్డ్ డిస్క్ డెలివరీలో ఆలస్యం లేకుండా చూసుకోవాలి. థియేటర్ల పంపకాలు, బిజినెస్ లెక్కలు ఎలాగూ ఉండనే ఉంటాయి. ఒకటి రెండు సార్లు ప్రభాస్ బయటికి వచ్చి మాట్లాడితే చాలు సలార్ కే కాదు ఫ్యాన్స్ కి సైతం కొండంత భరోసా దొరికేస్తుంది.