ఇంకో ఇరవై రోజుల కంటే తక్కువ వ్యవధిలో డిసెంబర్ 21, 22 తేదీల్లో డంకీ, సలార్ లు విడుదల కాబోతున్నాయి. ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా ట్రేడ్ పండితులు దీన్ని వర్ణిస్తున్నారు. థియేటర్ల సర్దుబాటు ఎలా చేయాలో అర్థం కాక బయ్యర్లు తలలు పట్టుకుంటున్నారు. అయితే అంచనాలు పెంచే విషయంలో మాత్రం ఈ రెండు ఒకేదారిలో వెళ్తున్నట్టు కనిపిస్తోంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మొన్న రిలీజైన సలార్ ట్రైలర్ మీద మిశ్రమ స్పందన వచ్చింది. ఫ్యాన్స్ కి నచ్చింది కానీ వావ్ అంటూ మురిసిపోలేదు. పైగా ఉగ్రంతో పోలికలు సోషల్ మీడియా రచ్చకు దారి తీశాయి.
త్వరలోనే రెండో ట్రైలర్ ని సిద్ధం చేయబోతున్నారు. ఇదిలా ఉండగా డంకీ టీమ్ డ్రాప్ 1, 2, 3 పేరుతో వదిలిన టీజర్, పాటలు ఇంకా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ లోకి వెళ్ళలేదు. మ్యూజిక్ లవర్స్ ఈ సినిమా సాంగ్స్ ని ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. డిడిఎల్, బాజీగర్, మున్నాభాయ్ లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ని తలదన్నే రేంజ్ లో ఉండాలని కోరుకున్నారు. కానీ వాస్తవానికి జరుగుతున్నది వేరు. పాటలు బాగానే ఉన్నా త్వరగా రీచ్ కావడం లేదు. పైగా ట్రైలర్ చూశాక మాస్ అంశాలు ఉండవని అర్థమైపోయింది. పఠాన్, జవాన్ లు ఇచ్చిన హై ఆశించకూడదని క్లారిటీ వచ్చింది.
ఇలా ఉండటం వల్ల ఓపెనింగ్స్ కి ఢోకా లేదు కానీ సగటు పబ్లిక్ లో బజ్ పెరగాలంటే మాత్రం ఇంకా మేజిక్ చేయాలి. ఎంత షారుఖ్ ఖాన్, ప్రభాస్ లు తిరుగులేని స్టార్లే అయినా జనం టాక్ చూసుకోకుండా వచ్చే పరిస్థితిలో లేరు. పఠాన్ కన్నా ముందు కింగ్ ట్రాక్ రికార్డు ఎంత బ్యాడ్ గా ఉందో తెలియంది కాదు. ప్రభాస్ మూడు డిజాస్టర్ల తర్వాత సలార్ తో వస్తున్నాడు. సహజంగానే ఫ్యాన్స్ భారీ ఎత్తున నమ్మకం పెట్టుకుంటారు. ఏదో ఎక్స్ ట్రాడినరి అనిపించే ప్రమోషనల్ కంటెంట్ బయటికి వదిలితే తప్ప ఊపు పెరగదు. బాక్సాఫీస్ వద్ద యానిమల్ జోరు తగ్గగానే వీటి స్పీడ్ పెంచాలి. తక్షణ కర్తవ్యం అదే.