నిన్న సలార్ ట్రైలర్ రిలీజయ్యాక సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ లేట్ ఎంట్రీ, సుదీర్ఘమైన పృథ్విరాజ్ సుకుమారన్ ఎపిసోడ్, కెజిఎఫ్ ని పోలిక బ్యాక్ డ్రాప్ ఇలా కారణాలు ఏమైనా మొత్తానికి హోంబాలే ఫిలింస్ ని రెండో ట్రైలర్ డిమాండ్ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో యాంటీ ఫ్యాన్స్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదటి కన్నడ సినిమా ఉగ్రంని తవ్వి తీస్తున్నారు. 2014లో వచ్చిన ఈ గ్యాంగ్ స్టార్ డ్రామా శాండల్ వుడ్ పెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచింది. హీరో శ్రీమురళికి బ్రేక్ ఇచ్చి స్టార్ గా ఎదగడంలో దోహదపడింది.
సలార్ కి ఉగ్రంకి కొన్ని సారూప్యతలున్నాయి. ఉగ్రంలో హీరో మెకానిక్. ఒక గ్యాంగ్ స్టర్ కూతురిని శత్రువుల బారి నుంచి కాపాడే క్రమంలో ఇతని చీకటి ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ కు తెలుస్తుంది. స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం నేర సామ్రాజ్యం మొత్తాన్ని తన హస్తగతం చేసుకునే క్రమంలో ఎంతటి విధ్వంసానికి అయినా తెగబడతాడు. సరిగ్గా ఇక్కడే రెండు సినిమాలకు లింక్ కుదురుతోంది. సలార్ లో పృథ్విరాజ్ పోలిన పాత్రను ఉగ్రంలో తిలక్ శంకర్ అనే నటుడు పోషించాడు. ఇక శ్రీమురళి లాగే ప్రభాస్ కూడా మెకానిక్కేనని ట్రైలర్ లోని ఒక షాట్ లో కాస్ట్యూమ్స్ లో కనిపించింది.
రెండేళ్ల క్రితమే సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ విషయాన్ని చూచాయగా చెప్పినా మొదట్లో సీరియస్ గా తీసుకోని వాళ్ళు ఇప్పుడు అదే పనిగా యూట్యూబ్ లో ఫ్రీగా దొరుకుతున్న ఉగ్రంని చూసేస్తున్నారు. ఓటిటి అవసరం లేకుండానే అందుబాటులో ఉండటంతో పోలికలు చేయడం మరింత సులభమవుతోంది. గ్రాండియర్, బ్యాక్ డ్రాప్ పరంగా సలార్, ఉగ్రంలకు నేరుగా సంబంధం లేకపోవచ్చు కానీ ఫ్రెండ్ కిచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్లే పాయింట్ మాత్రం దగ్గరగా కలుస్తోంది. సో దీనికి సంబంధించిన క్లారిటీ రావాలంటే డిసెంబర్ 22 దాకా ఎదురు చూడాల్సిందే.