కోటబొమ్మాళిని కాపాడిన క్యాస్టింగ్ మార్పులు

మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో ఆదికేశవని నెట్టేసి కోటబొమ్మాళి పీఎస్ విజేతగా నిలిచింది. మరీ బ్లాక్ బస్టర్ రేంజ్ వసూళ్లు లేవు కానీ బడ్జెట్-బిజినెస్ కోణంలో చూసుకుంటే లాభాల వైపే వెళ్తోంది. మూడు రోజులలోపే అయిదు కోట్ల గ్రాస్ దాటేయడం మాటలు కాదు. అయితే ఈ ప్రాజెక్ట్ చాలా ఆలస్యంగా మొదలై ఎన్నో మార్పులకు లోనైన సంగతి సాధారణ ప్రేక్షకులకు అంతగా అవగాహన లేదు. నాయట్టు రీమేక్ హక్కులు కొన్నప్పుడు ముందు అనుకున్న కాంబినేషన్ వేరు. రావు రమేష్ – ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో ఇప్పుడు శివాని రాజశేఖర్ పాత్రకు అంజలిని తీసుకుని పూజా కార్యక్రమాలు చేశారు.

పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో మొత్తం సెట్ అయ్యింది. కానీ తర్వాత బాగా అలోచించి ఈ కాంబోని థియేట్రికల్ గా అమ్మడం కష్టమని అల్లు అరవింద్, బన్నీ వాస్ లు అభిప్రాయపడ్డారు. దాంతో పాటు స్క్రిప్ట్ అనుకున్న రేంజ్ లో రాకపోవడంతో రిస్క్ ఎందుకని పెండింగ్ లో పెట్టారు. తర్వాత నెలలు గడిచిపోయాయి. వర్కౌట్ అవుతుందా లేదానే డిస్కషన్లు జరుగుతుండగానే ఆహాకు జోహార్ మూవీ చేసిన తేజ మర్ని తెరపైకొచ్చాడు. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానిలను రికమండ్ చేశాడు. రాజకీయ అంశాలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు జోడించాడు.

కట్ చేస్తే ముందు లేని కాన్ఫిడెన్స్ తేజ మర్ని వచ్చాక కుదిరింది. పైగా ముందు వేసుకున్న బడ్జెట్ కి ఇప్పటికి సగానికి పైగా తగ్గిపోవడంతో అరవింద్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యంగా శ్రీకాంత్ ని తీసుకోవడమనే ఆలోచన బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇచ్చింది. హీరో కాని హీరో పాత్రని ఆయన అనుభవంతో పోషించిన తీరు ఆడియన్స్ ని ఆకట్టుకుంది. కోటబొమ్మాళి కంటే ముందు అనుకున్న టైటిల్ బ్రాకెట్. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా లిస్టులో లేదు. అదేదో పెద్దలు సామెత చెప్పినట్టు ఆలస్యం అమృతం విషం తరహాలో నాయట్టు రీమేక్ లో జాప్యం జరిగినా చివరికి మంచిదే అయ్యింది.