కొత్త సినిమాలు దర్శకులకూ అగ్ని పరీక్షే

ఈ వారం రాబోతున్న రెండు చిత్రాలతో చాలామంది కెరీర్లు ఆధారపడి ఉన్నాయి. అందులో ప్రధాన పాత్రలు చేసిన వాళ్లకు.. నిర్మాతలకు.. టెక్నీషియన్లకు అందరికీ ఆ సినిమాల ఫలితాలు కీలకమే. ‘ఆదికేశవ’ హిట్ కావడం అందరికంటే హీరో వైష్ణవ్ తేజ్‌కు చాలా అవసరం. ‘ఉప్పెన’తో సంచలన అరంగేట్రం చేసిన వైష్ణవ్.. ఆ తర్వాత కొండపొలం, రంగ రంగ వైభవంగా చిత్రాలతో షాక్‌లు తిన్నాడు. కాబట్టి ఈ సినిమా అతడికి సక్సెస్ ఇచ్చి తీరాలి.

మరోవైపు ‘కోటబొమ్మాళి’ మీద రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాగా ఈ రెండు చిత్రాలూ వాటి దర్శకుల కెరీర్లనూ కూడా నిర్దేశించబోతున్నాయి. ‘ఆదికేశవ’తో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. అతను షార్ట్ ఫిలిమ్స్‌తో పాపులర్ అయ్యాడు. ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమా ద్వారా అతను దర్శకుడిగా పరిచయం కావాల్సింది. కానీ ఆ సినిమా మొదలయ్యాక కొన్ని కారణాలతో ఆగిపోయింది. తర్వాత చాలా గ్యాప్ తీసుకుని, కష్టపడి ‘ఆదికేశవ’ సెట్ చేసుకున్నాడు. తొలి సినిమా మొదలై ఆగిపోతే ఒక నెగెటివ్ ముద్ర పడుతుంది. అయినా ఎలాగోలా ఇంకో సినిమా సెట్ చేసుకున్నాడు. ఈ సినిమా అటు ఇటు అయితే శ్రీకాంత్‌ కెరీర్‌కు కష్టమవుతుంది. కాబట్టి అతను హిట్ కొట్టి తీరాలి.

ఇక ‘కోటబొమ్మాళి’ దర్శకుడు తేజ మర్ని విషయానికి వస్తే.. అతను ‘జోహార్’ అనే ఓటీటీ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అది పర్వాలేదనిపించింది. తర్వాత శ్రీ విష్ణుతో ‘అర్జున ఫల్గుణ’ తీశాడు. అది డిజాస్టర అయింది. ఈ స్థితిలో మలయాళ బ్లాక్ బస్టర్ ‘నాయట్టు’ను రీమేక్ చేసే బాధ్యతను గీతా ఆర్ట్స్ అతడికి అప్పగించింది. తెలుగు వెర్షన్లో చాలా మార్పులు చేర్పులు చేశారట. గీతా లాంటి పెద్ద సంస్థ నమ్మి ఇచ్చిన అవకాశాన్ని అతను ఏమేర సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. ఈ సినిమాను సక్సెస్ చేస్తే అతడికి మంచి అవకాశాలుంటాయి. లేదంటే మాత్రం కెరీర్‌కు కష్టమే.