మెగా ఫ్యాక్షన్ VS పోలీస్ స్టేషన్

రేపు కొత్త శుక్రవారానికి స్వాగతం పలుకుతూ బాక్సాఫీస్ రెడీ అవుతోంది. అయితే చెప్పుకోదగ్గ స్టార్ హీరోలవి లేకపోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా నెమ్మదిగా ఉన్నాయి. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఆదికేశవ మీద బజ్ సంగతేమో కానీ నిర్మాత నాగవంశీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మాత్రం మాస్ కంటెంట్ గట్టిగానే ఇవ్వబోతున్నారనే అభిప్రాయం కలుగుతోంది. అయితే ఆ ఫీలింగ్ ట్రైలర్ తో కలగకపోవడంతో ఫ్యాన్స్ లో జోష్ రాలేదు. టాక్ ని బట్టి పికప్ ఉంటుంది. శ్రీలీల షూటింగులతో బిజీగా ఉండటం వల్ల ప్రమోషన్లకు రాలేకపోవడం ఒక రకంగా మైనస్ అవుతోంది.

పవర్ ఫుల్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వైష్ణవ్ ని ఊర మాస్ లో చూపిస్తున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టులతో కంటెంట్ ని నమ్ముకుని వస్తున్న కోట బొమ్మాలి పీఎస్ పూర్తిగా టాక్ ని నమ్ముకుని బరిలో దిగుతోంది. మలయాళం సూపర్ హిట్ మూవీ నాయట్టుకి కీలక మార్పులు చేసిన జోహార్ దర్శకుడు తేజ మర్ని దీన్ని రూపొందించారు. లింగిడి లింగిడి సాంగ్ బాగా ప్రాచుర్యం పొందటం ప్లస్ అయ్యింది. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన ఈ కాప్ డ్రామాలో పోలీసుల వెంట పోలీసులే పడటమనే వెరైటీ పాయింట్ తో రూపొందింది.

ఈ రెండే ప్రధానంగా ఆడియన్స్ దృష్టిలో ఉన్నవి. ఇవి కాకుండా మాధవే మధుసూదన, పెర్ఫ్యూమ్ లు వస్తున్నాయి కానీ కనీస ఓపెనింగ్స్ ఆశించడం కూడా కష్టమే. ఏదో అద్భుతం జరగాలి. హాలీవుడ్ మూవీ నెపోలియన్ మీద మన జనాలకు అంత ఆసక్తి లేదు. 17న రిలీజైన మంగళవారంకు మంచి టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో దూకుడు కనిపించకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదికేశవ, కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ లు జనాన్ని థియేటర్లకు రప్పించాలంటే మేజిక్ అనిపించాలి. బాగున్నాయని మాట వస్తే చాలు సాయంత్రం నుంచే పబ్లిక్ ని టికెట్ కౌంటర్ల దగ్గర చూడొచ్చు.