షారుఖ్ ముందు సల్మాన్ తేలిపోతున్నాడే..

కొన్నేళ్లు వెనక్కి వెళ్తే.. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ఆధిపత్యం కనిపించేది. భజరంగి భాయిజాన్, సుల్తాన్ లాంటి బ్లాక్‌బస్టర్లతో సల్మాన్ ఊపు మామూలుగా లేదు అప్పట్లో. అదే సమయంలో షారుఖ్ ఖాన్ వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడ్డాడు. సినిమాల బిజినెస్, వసూళ్ల పరంగా సల్మాన్ ముందు షారుఖ్ అస్సలు నిలవలేని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.

‘జీరో’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ‘పఠాన్’తో బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చిన షారుఖ్ ఖాన్.. ఆ సినిమాతో రూ.1200 కోట్ల వసూళ్లు సాధించాడు. ఇంకో ఎనిమిది నెలల లోపే రిలీజైన షారుఖ్ కొత్త చిత్రం ‘జవాన్’ సైతం అదే స్థాయిలో వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ అయింది. రెండు సినిమాలకూ అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరిగాయి. ఇక ఓపెనింగ్స్ సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం ‘టైగర్-3’ మీద అందరి దృష్టీ నిలిచింది.

సల్మాన్‌కు కొన్నేళ్లుగా సరైన విజయాలు లేవు. ఆయన చివరి సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ పెద్ద డిజాస్టర్ అయింది. ఐతే ఆ ప్రభావం ‘టైగర్’ మీద ఉండదని.. ఈ ఫ్రాంఛైజీకి ఉన్న క్రేజే వేరని.. షారుఖ్ సినిమాలకు దీటుగా ఈ చిత్రం ఓపెనింగ్స్ తెచ్చుకుంటుందని సల్మాన్ అభిమానులు ఆశించారు. ఐతే సల్మాన్ గత చిత్రాలతో పోలిస్తే దీనికి క్రేజ్ ఎక్కువే కానీ.. ఈ ఏడాది షారుఖ్ సినిమాల తాలూకు హిస్టీరియాను రిపీట్ చేసే ఛాన్సే లేదని అర్థమవుతోంది. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలకు.. ‘టైగర్’కు పోలికే కనిపించడం లేదు.

పఠాన్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన 24 గంటల్లో నేషనల్ మల్టీప్లెక్స్ ఛైన్స్‌లో 1.40 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ‘జవాన్’కు అదే సమయంలో 1.17 లక్షల టికెట్లు సేల్ అయ్యాయి. కానీ ‘టైగర్-2’కి రెండు రోజులు గడిచినా ఇంకా లక్ష టికెట్ల మార్కును కూడా అందుకోలేదు. మూడో రోజు ఆ సినిమా లక్ష మార్కును అందుకుంది. ఈ ట్రెండ్ చూస్తుంటే ‘జవాన్’, ‘పఠాన్’ స్థాయిలో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ ఉండవని.. మహా అయితే చాన్నాళ్ల తర్వాత సల్మాన్‌కు ఓ హిట్ పడొచ్చని భావిస్తున్నారు.