బోయ‌పాటి ఇంకా దొరికేశాడు

స్కంద సినిమా థియేట‌ర్ల‌లో రిలీజైన‌పుడు అందులోని లాజిక్ లెస్ సీన్లు.. ఓవ‌ర్ ద టాప్ యాక్ష‌న్ ఎపిసోడ్లు.. అర్థ‌ర‌హిత‌మైన క‌థ గురించి సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు బోయ‌పాటిని ఎలా ఆడుకున్నారో తెలిసిందే. ఈ నెగెటివ్ డిస్క‌ష‌న్ల వ‌ల్లే సినిమా వీకెండ్ త‌ర్వాత అస్స‌లు నిల‌బ‌డ‌లేక‌పోయింది. అప్పుడు బోయ‌పాటికి ఇచ్చిన డోస్ స‌రిపోద‌ని నెటిజన్లు ఇప్పుడు మ‌ళ్లీ దిగారు. ఈ సినిమా ఇటీవ‌లే ఓటీటీలోకి వ‌చ్చింది.

ఆ వ‌చ్చిన రోజు నుంచి ఒక్కో స‌న్నివేశాన్ని తూర్పార‌బ‌డుతూ నెటిజ‌న్లు బోయ‌పాటిని ఏకిప‌డేస్తున్నారు. ఓవైపు హీరో చేతిలో చ‌స్తూ.. ఇంకోవైపు ఆ దృశ్యాన్ని చూస్తున్న వారిలో కూడా అదే వ్య‌క్తి క‌నిపించిన సీన్ గురించి మామూలుగా ట్రోలింగ్ జ‌ర‌గ‌ట్లేదు. అలాగే పొలిటిక‌ల్ సైన్స్ క్లాసులో ఉండే అమ్మాయిలు సంబంధం లేని పుస్త‌కాలు ప‌ట్టుకుని క‌నిపించిన షాట్ కూడా ఒక‌టి ట్రోలింగ్‌కు గుర‌వుతోంది.

ఇవ‌న్నీ చాల‌వ‌ని బోయ‌పాటి ఇంకో సీన్లో మ‌రీ అడ్డంగా దొరికేశాడు. క్లైమాక్స్ ఫైట్లో హీరో రామ్ దీప స్తంభాలు తీసుకుని విల‌న్ల మీద ఎటాక్ చేసే షాట్ ఒక‌టి ఉంటుంది. ఆ షాట్ మామూలుగా చూస్తే ఏం తేడాగా అనిపించ‌దు. కానీ ఓటీటీలో సినిమాలు చూసే కుర్రాళ్లు మామూలు వాళ్లా? స్లోమోష‌న్లో ఆ షాట్‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించి.. ఒక చోట రామ్ స్థానంలో బోయ‌పాటి నిల‌బ‌డి ఆ షాట్‌ను త‌న మీదే షూట్ చేయించుకున్న విష‌యాన్ని క‌నిపెట్టేశారు. అచ్చం రామ్ లాగే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని బోయ‌పాటే ఆ షాట్ లాగించేశాడు.

ఊరికే ముచ్చ‌ట తీర్చుకోవ‌డానికి అలా చేశాడా.. ఆ స‌మ‌యానికి హీరో అందుబాటులో లేడా అన్న‌ది తెలియ‌దు కానీ.. నెటిజ‌న్ల‌కు మాత్రం అడ్డంగా దొరికేసిన బోయపాటి వాళ్ల‌కు ఆహారంగా మారిపోయాడు. ఇవ‌న్నీ లార్డ్ బోయ థింగ్స్ అంటూ నెటిజ‌న్లు ఈ ద‌ర్శ‌కుడిని ఒక ఆట ఆడుకుంటున్నారు సోష‌ల్ మీడియాలో. గ‌తంలో గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాకు సంబంధించిన ఒక షాట్లో హ‌రీష్ శంక‌ర్ సైతం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు డూప్‌గా న‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయిన సంగ‌తి తెలిసిందే.