ఒక పెద్ద సినిమా మొదలు కాగానే అది తన కథేనంటూ ఎవరో ఒక రచయిత రచ్చ చేయడం సినిమాల్లో చివరి సీన్లో పోలీసులు రావడమంత రొటీన్. కొన్ని కొన్నిసార్లు ఆ రచయితల ఆరోపణలు రుజువవుతుంటాయి. వారికి కాస్త పారితోషికమో, లేదా టైటిల్ కార్డ్ లో చిన్న క్రెడిట్టో ఇచ్చేస్తుంటారు. సినిమా విడుదలయిన తర్వాత అలాంటి వివాదాలు తలెత్తి రచయిత ఆరోపణ రుజువయితే రాయల్టీలాంటిది చెల్లిస్తుంటారు. సుకుమార్ ‘పుష్ప’ కథ ఏమిటనేది అతనికీ, అల్లు అర్జున్‍కీ, ఆ చిత్రానికి పని చేసేవారికీ తప్ప ఎవరికీ తెలియకపోయినా అది తన కథేనని ఒక రచయిత ఆరోపిస్తున్నాడు.
తాను రాసిన ‘తమిళ కూలీలు’ కథను సుకుమార్ కాపీ చేసాడని అంటున్నాడు. అయితే ఇదే వెంపల్లి గంగాధర్ గతంలో ‘అరవింద సమేత’ కథ తన ‘మొండికత్తి’ కథనుంచి త్రివిక్రమ్ కాపీ చేసాడని ఆరోపించాడు. నిజంగానే అరవింద సమేతలో ‘మొండి కత్తి’ ప్రస్తావన వున్నా కానీ ఆ రెండిటి కథలకూ అసలు సంబంధం లేకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. మరిప్పుడు సుకుమార్ సినిమాలోను తమిళ కూలీల ప్రస్తావన మినహా మరేమీ లేకపోతే ఇదీ మరుగున పడిపోతుందేమో.
ఇదిలావుంటే ఆచార్య కథ తనదే అని చెప్పిన రచయితకు కొరటాల శివ బదులిచ్చాడు. ఆచార్య కథ తన సొంతమని స్పష్టం చేసాడు. బాలీవుడ్‍ని నెపోటిజమ్ పీడిస్తున్నట్టు టాలీవుడ్‍కి ప్లాగియారిజమ్ పీడ ఎప్పటికీ వదిలేట్టు లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates