వెంకీ సినిమా నేనే ఆపేశా-తరుణ్‌ భాస్కర్‌

పెళ్ళిచూపులు సినిమాతో తరుణ్‌ భాస్కర్‌ ఏడేళ్ల కిందట ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. సరికొత్త కథాకథనాలతో ప్రేక్షకులకు ఒక భిన్నమైన అనుభూతిని పంచాడు తరుణ్‌ ఆ చిత్రంతో. ఈ సినిమాతో తరుణ్‌ మీద భారీగా అంచనాలు నెలకొనగా.. సీనియర్‌ హీరో దగ్గుబాటి వెంకటేష్‌ తనతో పని చేయడానికి ఆసక్తి చూపించాడు. వీళ్లిద్దరి కలయికలో గుర్రపు రేసుల నేపథ్యంలో ఓ సినిమా రాబోతోందని, సురేష్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని ప్రచారం జరిగింది.

కానీ ఏళ్లు గడిచాయి. ఎంతకీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. మధ్యలో తరుణ్‌.. ఈ నగరానికి ఏమైంది సినిమా చేశాడు. ఇప్పుడు కీడాకోలాతో రాబోతున్నాడు. దీని తర్వాత అతను విజయ్‌ దేవరకొండతో జట్టు కట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి వెంకీతో సినిమా సంగతి ఏమైందో తెలియదు. కీడాకోలా సినిమా ప్రమోషన్లలో భాగంగా వెంకీ సినిమా గురించి అడిగితే.. తరుణ్‌ భాస్కర్‌ తెర వెనుక సంగతులు చెప్పాడు.

ఒక కొత్త ఐడియాతో ఆ కథ రాశానని.. కాకపోతే దాని ముగింపు, మరికొన్ని విషయాల్లో తనకు సంతృప్తి కలగలేదని చెప్పాడు. కానీ నిర్మాత సురేష్‌ బాబుకు ఆ స్క్రిప్టు నచ్చి సినిమా తీయడానికి రెడీ అయ్యారని తరుణ్‌ తెలిపాడు. కానీ తనకే సంతృప్తి లేక ఆ సినిమాను ఆపేశానన్నాడు. ఐతే తర్వాత దాని మీద పని చేసి కథను ఒక కొలిక్కి తెచ్చానని.. ఇప్పుడు ఆ సినిమా చేయడానికి రెడీగానే ఉన్నానని చెప్పాడు.

కీడాకోలా రిజల్ట్‌ను బట్టి త్వరలో వెంకీతో ఆ కథను తీస్తానని చెప్పాడు తరుణ్‌. ఇక కీడాకోలా సినిమా గురించి చెబుతూ.. ఇప్పటిదాకా తీసిన మూడు చిత్రాల్లో తాను ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నది కీడాకోలా విషయంలోనే అని తరుణ్‌ తెలిపాడు. ఈ సినిమాను 2 గంటల 20 నిమిషాల నిడివితో తీశానని.. కానీ క్రైమ కామెడీలు క్రిస్ప్‌గా ఉంటే బాగుంటుందని.. తనే ఓ పావుగంట ఎడిట్‌ చేశానని తరుణ్‌ చెప్పాడు.