దసరా అంటే బాగా సందడి కనిపించే పండుగ. సినిమాల పరంగా కూడా ఆ రోజు సందడి ఘనంగా ఉంటుంది. కొత్త సినిమాలు రిలీజ్ చేయడంలోనూ కాదు.. సినిమాలకు సంబంధించి విశేషాలు పంచుకోవడంలోనూ దర్శక నిర్మాతలు ఉత్సాహం చూపిస్తారు. ఈ దసరాకు చాలా కానుకలు ఉంటాయని.. సోషల్ మీడియా మోత మోగిపోతుందని వివిధ పెద్ద చిత్రాల మీద చాలా ఆశలతో ఉన్నారు అభిమానులు. కానీ పండుగ రోజు అలాంటి సందడే కనిపించలేదు.
అందరు అభిమానుల్లోకి ఎక్కువ డిజప్పాయింట్ అయింది ప్రభాస్ ఫ్యాన్స్ అనే చెప్పాలి. ఈ రోజు వాళ్లకు చాలా స్పెషల్. ప్రభాస్ పుట్టిన రోజు, పైగా దసరా రోజు వచ్చింది. ప్రభాస్ కొత్త సినిమా ‘సలార్’ ట్రైలర్ లాంచ్ చేయడానికి ఇంతకంటే మంచి సందర్భం మరొకటి ఉండదు. ‘సలార్’ ఎంత భారీ చిత్రమో తెలిసిందే. కాబట్టి దీనికి రెండు ట్రైలర్లు కట్ చేసుకోవడానికి అవకాశముంది.
అందులో ఒకటి ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేసి.. ఇంకోటి రిలీజ్‌కు రెండు వారాల ముందు వదిలి ఉండొచ్చు. ఇప్పటిదాకా ‘సలార్’కు సంబంధించి సరైన ప్రమోషనల్ కంటెంటే వదల్లేదు. అలాంటపుడు ట్రైలరో లేదంటే కనీసం మంచి ఎలివేషన్ ఉన్న ఒక పాటో రిలీజ్ చేయాల్సింది. కానీ ఈ అకేషన్‌ను టీం ఉపయోగించుకోలేదు. అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇక ‘గేమ్ చేంజర్’ విషయంలో సరైన సమాచారం లేక ఫ్రస్టేషన్లో ఉన్న రామ్ చరణ్ అభిమానులును దసరాకు పాట రిలీజ్ చేస్తామంటూ చిత్ర వర్గాలు ఊరించాయి. తీరా చూస్తే అలాంటిదేమీ లేకపోయింది. చివరికి దీపావళికి సినిమా నుంచి పాట వస్తుందంటూ చరణ్ ముఖం కనిపించని ఒక పోస్టర్ వదిలారు.
ఇక మహేష్ బాబు కొత్త చిత్రం ‘గుంటూరు కారం’ నుంచి దసరాకు పాట లాంచ్ ఉంటుందని ముందు ప్రచారం జరిగింది. కానీ తర్వాత మొక్కుబడిగా ఒక పోస్టర్ రిలీజ్ చేసి త్వరలో తొలి పాట అన్నారు. ఇక వేరే పెద్ద సినిమాలు వేటి నుంచి కూడా చెప్పుకోదగ్గ విశేషాలేవీ బయటికి రాలేదు. నాని కొత్త చిత్రం ‘సరిపోదా శనివారం’ గ్లింప్స్ ఒక్కటి సందడి చేసింది. దేవర నుంచి ఒక పోస్టర్ వదిలారు. అందులో ఎన్టీఆర్ కనిపించలేదు. పుష్ప లాంటి పెద్ద సినిమా నుంచి ఏ విశేషం బయటికి రాలేదు. ఇక సంక్రాంతి సినిమాలు ఏవీ కూడా పెద్దగా సందడి చేయలేకపోయాయి.