ఆస్కార్ రేంజ్ సినిమాకి దారుణమైన వసూళ్లు

పేరుకేమో అక్షయ్ కుమార్ కొత్త సినిమా మిషన్ రాణిగంజ్ ని ఆస్కార్ నామినేషన్ కోసం సిద్ధం చేస్తున్నారు. తీరా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు చూస్తుంటే మాత్రం మరీ డిజాస్టర్ కన్నా తీసికట్టుగా ఉండటం ఫ్యాన్స్ ని కలవరపరుస్తోంది. పది రోజులకు గాను కేవలం 28 కోట్లే వసూలు చేసిందని ట్రేడ్ టాక్. ఇది పెద్ద అవమానం. పాజిటివ్ రివ్యూలు చాలా వచ్చాయి. అక్కి అదరగొట్టాడంటూ కొందరు బాలీవుడ్ విశ్లేషకులు పల్లకిలు మోశారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి జవాన్, పఠాన్ లు దిగదుడుపంటూ రివ్యూలో పేర్కొన్నారు. ఇంత బిల్డప్ ఇచ్చింది మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నిన్న నేషనల్ డే సందర్భంగా మల్టీప్లెక్సులు 99 రూపాయలకు టికెట్లు అమ్మడం వల్ల ఈ మాత్రం వసూళ్లు దక్కాయి. అక్టోబర్ 15 నమోదైన ఆక్యుపెన్సీలలో మిషన్ రాణిగంజ్ వాటా 21 శాతం. దీనికన్నా జవాన్ ఎక్కువ నమోదు చేయడం మరో ట్విస్టు. అక్షయ్ కుమార్ కథల ఎంపిక మీద గత కొంత కాలంగా విమర్శలు వస్తున్నాయి. బయోపిక్ అంటే చాలు ముందు వెనుకా ఆలోచించకుండా ఒప్పేసుకుంటున్నాడని ఫ్యాన్స్ ఒకటే వాపోతున్నారు. దీని వల్ల నష్టాలతో పాటు లేనిపోని ట్రోలింగ్ ఎదురుకోవాల్సి వచ్చిందని వాళ్ళ బాధ.

ఇవేవి పట్టించుకునే స్థితిలో అక్షయ్ కుమార్ లేడు. మంచి సినిమాలు తీస్తూనే ఉంటానని. మరుగుదొడ్లు, శానిటరీ ప్యాడ్స్ మీద నటించే దమ్మున్న హీరోలను చూపించమని సవాల్ విసురుతున్నాడు. అతను అడిగిన దాంట్లో లాజిక్ ఉంది కానీ బిజినెస్ లెక్కాలంటూ కొన్ని ఉంటాయి. నిర్మాతల కోట్ల రూపాయల పెట్టుబడులను పణంగా పెట్టి మన అభిరుచులు తీర్చుకుంటూ పోతే దీనికి అంతం ఉండదు. నటుడిగా ఎంత సంతృప్తి దక్కినా బయ్యర్లు, ప్రేక్షకులు సినిమా చూసి సంతోషంగా ఫీలవ్వనప్పుడు ఎంత చేసినా ఏం ప్రయోజనం. ఇది అక్షయ్ బాబా ఎప్పుడు గుర్తిస్తాడో ఏంటో మరి.