నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి మీద మాములు అంచనాలులేవు . అఖండ, వీరసింహారెడ్డి రెండు బ్లాక్ బస్టర్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు హ్యాట్రిక్ కొడుతుందని ఖరారుగా నమ్ముతున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ అయినప్పటికీ తండ్రి కూతుళ్ళ తరహాలో కనిపిస్తున్న బాలయ్య, శ్రీలీల బంధాన్నే ఎక్కువ హైలైట్ చేస్తూ ప్రమోషన్లు చేస్తున్నారు. అందరి కళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లాంచ్ చేయబోయే ట్రైలర్ మీదే ఉన్నాయి. ఆ ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రెండున్నర నిముషాల వీడియోతో బాలయ్య మాస్ వచ్చేసింది
చిచ్చా అని భగవంత్ కేసరి(బాలకృష్ణ)ని ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే ఓ అమ్మాయి(శ్రీలీల)కి అతనే లోకం. అయితే కంటికి రెప్పలా చూసుకుంటున్న ఆమెను ఎలాగైనా ఆర్మీ ఆఫీసర్ చేయాలనేదే కేసరి సంకల్పం. అనుకున్నంత సులభంగా ఇది జరగదు. ట్రైనింగ్ అంటేనే భయపడే ఆ బిడ్డ మీద ఓ విషనాగు(అర్జున్ రామ్ పాల్) కన్ను పడుతుంది. చంపేందుకు వెంటపడతాడు. పాపకు చిన్న గాయమైతేనే తట్టుకోని భగవంత్ ఏకంగా బిడ్డ ప్రాణాలకు ముప్పు రావడంతో తనలో అసలు రూపాన్ని బయటికి తీస్తాడు. నేలకొండ అడవి పౌరుషాన్ని కార్పొరేట్ విలన్ కి రుచి చూపిస్తాడు.
పక్కా తెలంగాణ యాసతో బాలయ్య పలికిన సంభాషణలు కొత్తగానే కాదు స్పెషల్ మాస్ గా ఉన్నాయి. అర్జున్ రాంపాల్ కి సవాలు విసిరే సన్నివేశాల్లో, శ్రీలీల కోసం తల్లడిల్లిపోయే సీన్లలో వింటేజ్ బాలకృష్ణ విశ్వరూపం వెలికి తీశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. యాక్షన్ తో పాటు సెంటిమెంట్, ఎంటర్ టైన్మెంట్ కి లోటు లేకుండా తీర్చిదిద్దిన భగవంత్ కేసరికి తమన్ నేపధ్య సంగీతం, రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం మరింత పవర్ ని జోడించాయి. ట్రైలర్ చివర్లో బాలయ్యతో నేనెలా పాడినా ఎవరేమనుకున్నా విడిచిపెట్టాననే రీతిలో ట్విస్ట్ ఇవ్వడం బాగుంది. అక్టోబర్ 19కి కావాల్సినంత హంగామా ట్రైలర్ తో మొదలైపోయింది