ట్రైలర్: అమాయకుడు చేసే అరాచకం ‘లియో’

మాములుగా తమిళ మార్కెట్ కే పరిమితమైన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి గత కొన్నేళ్లుగా తెలుగులోనూ బేస్ పెరిగింది. తుపాకీతో మొదలుపెట్టి మంచి కమర్షియల్ విజయాలు అందుకోవడంతో ప్రతిదీ డబ్బింగ్ జరుపుకుని ఒకే సమయంలో రిలీజ్ అయ్యేలా నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. వారసుడు లాంటి రొటీన్ కంటెంట్ సైతం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు దక్కించుకోవడం చెప్పకనే చెబుతుంది అతని స్టామినా ఏంటో. ఈ నేపథ్యంలో వస్తున్న లియో మీద మాములు అంచనాలు లేవు.. సితార సంస్థ భారీ మొత్తానికి హక్కులు కొనుగోలు చేయడం సంచలనం.

ఇందాక విడుల చేసిన ట్రైలర్ లో కథకు సంబంధించిన కీలక క్లూస్ ఇచ్చారు. నడిరోడ్డు మీద అమాయకులను కిరాతకంగా చంపే సైకో కిల్లర్ ని ఎదిరిస్తాడో పోలీస్ ఆఫీసర్(గౌతమ్ మీనన్). ఆయనతో సంబంధం ఉన్న ఓ యువకుడు(విజయ్) ఆ సంఘటనను వదిలేసి భార్య(త్రిష)తో దూరంగా వెళ్ళిపోయి బ్రతుకుతూ ఉంటాడు. ఇతన్నే లక్ష్యంగా పెట్టుకున్న ఇద్దరు దుర్మార్గులు(సంజయ్ దత్-అర్జున్)వెతికి మరీ కుటుంబాన్ని వేధించడం మొదలుపెడతారు. అయితే అచ్చం తనలాగే ఉండే లియో(విజయ్)వల్ల ఇదంతా జరుగుతోందని తెలుసుకుని అతను ఎదురు తిరుగుతాడు. అక్కడి నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది.

విజువల్స్ అన్నీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్టైల్ లో ఉన్నాయి. విజయ్ డ్యూయల్ రోల్ అనే సంకేతం స్పష్టంగానే ఇచ్చారు. రెండు షేడ్స్ ని రివీల్ చేసేయడంతో పెద్దగా సస్పెన్స్ లేదు. అనిరుద్ రవిచందర్ సంగీతం అతని పంథాలోనే సాగింది. విక్రమ్ ని మించి డెప్త్, యాక్షన్, వయొలెన్స్ ఈ లియోలో కనిపిస్తోంది. క్యాస్టింగ్ మొత్తాన్ని రివీల్ చేశారు. ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ నుంచి ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చే ప్రయత్నం గట్టిగానే చేశారు. అక్టోబర్ 19న భారీ అంచనాలతో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, గణపథ్ లతో పోటీ పడబోతున్న లియో ట్రైలర్ పరీక్షలో మంచి మార్కులతో పాసయ్యాడు.