ప్రేక్షకుల హావభావాలు ప్రత్యక్షంగా చూపిస్తారట

ఎల్లుండి విడుదల కాబోతున్న మామా మశ్చీంద్ర ప్రీమియర్లకు సుధీర్ బాబు బృందం వెరైటీ ఐడియా వేసింది. ముందు రోజు రాత్రి ఏఎంబి మల్టీప్లెక్స్ లో వేయబోయే స్పెషల్ షోలో రెండున్నర గంటల పాటు ఆడియన్స్ లైవ్ రియాక్షన్లను రికార్డు చేసి ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. ఇండియన్ సినిమాలో ఇలా చేయడం ఇదే మొదటిసారని అంటున్నారు. ఇది నిజమే. వినడానికి బాగానే ఉంది కానీ ప్రాక్టికల్ గా ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే కెమెరాలు తమని గమనిస్తున్నాయన్న స్పృహ ప్రేక్షకుల స్వేచ్ఛని సహజంగానే తగ్గించేస్తుంది.

ఏదో పది ఇరవై నిముషాలు అంటే ఓకే కానీ మరీ సినిమా మొత్తం వాళ్ళ హావభావాలు చూపించడమంటే కొంచెం చిక్కే. ముందుగానే చెప్పి ప్రిపేర్ చేసి ఉంటారు కాబట్టి అభ్యంతరాలు రాకపోవచ్చు. కానీ ఇదేదో ఒక అరగంట గంటకు పరిమితం చేయడమో లేదా మొత్తం అయ్యాక ముఖ్యమైనవి మాత్రమే ఎడిట్ చేసి వాటిని ప్రమోషన్లలో వాడుకోవడమో చేసి ఉంటే బాగుండేది. విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఓపెనింగ్స్ రావాలంటే ఏదో ఒక కొత్త స్ట్రాటజీ ఫాలో కావాల్సిందే. మామా మశ్చీంద్ర టీమ్ వెరైటీగా ఆలోచించింది. ఫలితం ఎలా ఉండబోతోందో రేపు చూడాలి.

ఒకవేళ ఇది సక్సెస్ అయితే తర్వాత మిగిలినవాళ్లు దీన్ని ఫాలో అయినా ఆశ్చర్యం లేదు. నటుడు రచయిత హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన మామా మశ్చీంద్రలో సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ చేయడం ప్రధాన ఆకర్షణ. ఒకేలా కనిపించే లుక్స్ కాకుండా వృద్ధుడు, స్థూలకాయుడు, యువకుడు ఇలా మూడు రూపాల్లో కనిపించబోతున్నాడు. ట్రైలర్ చూశాక పాయింట్ అయితే వెరైటీగా అనిపించింది. రూల్స్ రంజన్, మంత్ అఫ్ మధు, మ్యాడ్, 800లతో పోటీ పడుతున్న మామా మశ్చీంద్రకు హిట్ టాక్ వస్తే మాత్రం దసరా దాకా మంచి వసూళ్లు రాబట్టుకునే ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి ఏం చేయనుందో.