స్కంద‌.. ప‌డుతూ లేస్తూ..

రామ్, బోయ‌పాటి శ్రీనుల క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన సినిమా.. స్కంద‌. ఐతే ఈ కాంబో మీద పెట్టుకున్న అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు సినిమా లేదు. చాలా రొటీన్‌గా అనిపించే క‌థ‌… ఓవ‌ర్ ద టాప్ యాక్ష‌న్ సీక్వెన్స్‌లు, లాజిక్ లెస్ సీన్ల‌తో సినిమాను చుట్టేశాడు బోయ‌పాటి. కాక‌పోతే మాస్‌లో రామ్‌కు, బోయ‌పాటికి ఉన్న ఫాలోయింగ్ వ‌ల్ల‌.. రిలీజ్ టైమింగ్ కూడా కుద‌ర‌డం వ‌ల్ల తొలి రోజు ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్సే వ‌చ్చాయి.

రూ.14 కోట్ల దాకా గ్రాస్.. 8 కోట్లకు పైగా షేర్ వ‌చ్చిందీ చిత్రానికి గురువారం. కానీ టాక్ ఏమంత గొప్ప‌గా లేక‌పోవ‌డంతో రెండో రోజు సినిమా వ‌సూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. ఒక్క‌సారిగా 60 శాతం డ్రాప్‌తో రూ.3 కోట్ల‌కు కాస్త ఎక్కువ‌గా షేర్ వ‌చ్చింది అంతే. రెండో రోజు షేర్. శుక్ర‌వారం కాబ‌ట్టి వ‌సూళ్లు త‌గ్గాయి.. శ‌నివారం వీకెండ్ కాబ‌ట్టి క‌లెక్ష‌న్లు పుంజుకుంటాయ‌ని అనుకుంటే అలా ఏమీ జ‌ర‌గలేదు. రెండో రోజు క‌న్నా వ‌సూళ్లు మ‌రింత త‌గ్గాయి.

శ‌నివారం మూడు కోట్ల కంటే షేర్ త‌క్కువ వ‌చ్చింది. మొత్తంగా మూడు రోజుల షేర్ రూ.15 కోట్ల‌కు చేరువ‌గా ఉంది. వ‌సూళ్లు రోజు రోజుకూ డ్రాప్ అవుతుండ‌టం బ‌య్య‌ర్ల‌ను ఆందోళ‌న‌లోకి నెట్టింది. ఐతే ఆదివారం స్కంద వ‌సూళ్లు పుంజుకున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. సాయంత్రం, నైట్ షోల‌కు ఫుల్స్ ప‌డుతున్నాయి. నాలుగో రోజు షేర్ 2, 3 మూడు రోజుల‌తో పోలిస్తే మెరుగ్గా ఉండేలా క‌నిపిస్తోంది.

స్కంద‌కు క‌లిసొస్తున్న అంశం ఏంటంటే.. సోమ‌వారం గాంధీ జ‌యంతి సెల‌వు ఉంది. ఆ రోజు కూడా వ‌సూళ్లు బాగానే ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ సినిమా టార్గెట్ రూ.40 కోట్లు కాగా.. కొంచెం క‌ష్ట‌ప‌డితే రూ.30 కోట్ల మార్కును అందుకోవ‌చ్చేమో. అంత‌కుమించి ఆశ‌లు పెట్టుకునేలా లేదు ట్రెండ్ చూస్తుంటే. ఈ సినిమాకు వ‌చ్చిన టాక్‌తో పోలిస్తే ఈ మాత్రం వ‌సూళ్లు కూడా గొప్పే అవుతుంది.