ఈ సినిమాతో స‌లార్‌ను కొట్టేవాడా?

త‌న సినిమా క‌శ్మీర్ ఫైల్స్ ధాటికి ప్ర‌భాస్ మూవీ రాధేశ్యామ్ కుదేలైంద‌ని.. ఈసారి త‌న వ్యాక్సిన్ వార్‌కు పోటీగా స‌లార్ వ‌స్తే మ‌రోసారి ప్ర‌భాస్ మీద పైచేయి సాధిస్తాన‌ని కొన్ని నెల‌ల కింద‌ట బీరాలు ప‌లికాడు బాలీవుడ్ ఫిలిం మేక‌ర్ వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి. ఐతే క‌శ్మీర్ ఫైల్స్ అనుకోకుండా ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయిపోయి సెన్సేష‌న‌ల్ హిట్ అయిపోయింది కానీ.. అన్నిసార్లూ అలాంటి మ్యాజిక్స్ జ‌ర‌గ‌వ‌ని అంద‌రికీ తెలుసు.

వ్యాక్సిన్ వార్ మూవీకి పాజిటివ్ రివ్యూలు వ‌చ్చినా స‌రే.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌నీస ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. స‌లార్ సినిమా వ‌చ్చి ఉంటే.. దాని ముందు వ్యాక్సిన్ వార్ ఎలా ప‌చ్చ‌డి అయిపోయేదో.. ఈ సినిమాకు వ‌చ్చిన ఓపెనింగ్స్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. తొలి రోజు ఇండియా మొత్తంగా వ‌చ్చిన వ‌సూళ్లు కేవ‌లం కోటి రూపాయ‌లే. రెండో రోజు ఆ మాత్రం వ‌సూళ్లు కూడా రాలేదు.

త‌న గ‌త చిత్రంతో 300 కోట్లకు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టిన ద‌ర్శ‌కుడి నుంచి వ‌చ్చిన కొత్త చిత్రం పాజిటివ్ రివ్యూలు తెచ్చుకుని కూడా ఇంత ఘోరంగా పెర్ఫామ్ చేయ‌డం అనూహ్యం. ప్రాపగండా సినిమాలు అన్నిసార్లూ వ‌ర్క‌వుట్ కావ‌ని చెప్ప‌డానికి ఇది రుజువు. సినిమా ఎలా ఉందో తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి కూడా జ‌నాల‌కు లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

హిందీలోనే రిజెక్ష‌న్‌కు గురైన ఈ చిత్రానికి వేరే భాష‌ల్లో క‌నీస స్పంద‌న కూడా లేదు. ఇత‌ర భాష‌ల్లో ఈ సినిమాను ప్ర‌ద‌ర్శించేవాళ్లు కూడా క‌నిపించ‌డం లేదు. మొత్తంగా చూస్తే ఈ సినిమా మీద పెట్టిన ప‌బ్లిసిటీ, రిలీజ్ ఖ‌ర్చులు కూడా వెన‌క్కి వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. త‌క్కువ బ‌డ్జెట్లో తీశారు కాబ‌ట్టి డిజిట‌ల్, శాటిలైట్ హ‌క్కుల ద్వారా పెట్టుబ‌డి వెన‌క్కి తెచ్చుకోవ‌చ్చు కానీ.. థియేట‌ర్ల ద్వారా మాత్రం వ‌చ్చే ఆదాయం ఏమీ లేద‌నే చెప్పాలి.