మంచి కంటెంట్ వాడుకోవయ్యా మామా

మహేష్ బాబు మద్దతు ఎంత ఉన్నా స్వంతంగా కష్టపడుతున్న సుధీర్ బాబుకి సరైన హిట్టు పడి సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రయోగం పేరుతో నెగటివ్ ట్రై చేద్దామని తీసుకున్న మలయాళం రీమేక్ హంట్ దారుణంగా డిజాస్టర్ కావడంతో ఒక పాఠంలా నిలిచిపోయింది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రయత్నం మంచిదే అయినా ఫలితం చేదుగా వచ్చింది. అందుకే ఈసారి రిస్క్ జోలికి పోకుండా మంచి యాక్షన్ కం ఎంటర్ టైనింగ్ థ్రిల్లర్ తో వస్తున్నాడు. అదే మామా మశ్చీంద్ర. నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 6 విడుదల కానుంది.

ఆ రోజు విపరీతమైన పోటీ నెలకొంది. రూల్స్ రంజన్, మ్యాడ్, 800, మంత్ అఫ్ మధు, రాక్షస కావ్యం లాంటి చిన్నా మీడియం సినిమాలు పెద్దగానే క్యూ కడుతున్నాయి. అయితే కంటెంట్, క్వాలిటీ, బడ్జెట్ పరంగా పైచేయి మామా మశ్చీంద్రదే. కాకపోతే ప్రమోషన్లు కాస్త నెమ్మదిగా ఉండటంతో జనానికి చేరడంలో టైం పడుతోంది. వయసు మళ్ళిన మేనమామ అచ్చం తన పోలికలోనే ఉండే ఇద్దరు మేనల్లుళ్ల మీద ప్రతీకారాన్ని తెగబడటమనే వెరైటీ పాయింట్ తో రూపొందింది. చాలా రిస్క్ అనిపించే ట్రిపుల్ రోల్ ని సుధీర్ బాబు చేయడం ఇందులో ప్రధానమైన హైలైట్.

వాటిలో ఒకటి వృద్ధుడి పాత్ర కాగా మరొకటి భారీ స్థూలకాయంతో ఉన్నది. ఈ తరహా ఎక్స్ పరిమెంట్లు ఇపుడున్న హీరోల్లో చేయడం అరుదు. ఇలాంటి విషయాలను పబ్లిసిటీకి వాడుకుంటే ఆడియన్స్ కి ఇంకా బాగా రీచ్ అవుతుంది. ఈషా రెబ్బ, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించిన మామా మశ్చీంద్ర కోసం హర్షవర్ధన్ చాలా డిఫరెంట్ ట్రీట్ మెంట్ ఇచ్చారనే టాక్ ఆల్రెడీ ఉంది. స్కంద, పెదకాపు, చంద్రముఖి 2లు ఎలాగూ రెండో వారంలో నెమ్మదిస్తాయి కాబట్టి మామా మశ్చీంద్ర ఏ ఏ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా సుధీర్ బాబు ఎదురు చూస్తున్న హిట్టు ఒళ్ళోకొచ్చి పడుతుంది.