బోయపాటీ.. ఇవేం లాజిక్కులయ్యా

బోయపాటి శ్రీను సినిమాలంటే ఎలా ఉంటాయో అందరికీ ఒక అవగాహన ఉండదు. ఆయన చిత్రాల్లో లాజిక్ కొండెక్కి కూర్చుంటుంది. కథ.. పాత్రలు.. సన్నివేశాలు.. అన్నీ కూడా ఇల్లాజికల్‌గా ఉంటాయి. ఫిజిక్స్ సూత్రాలన్నింటినీ తీసి చెత్త బుట్టలో పడేస్తూ సాగుతాయి ఆయన సినిమాల్లో యాక్షన్ ఘట్టాలు. ఫైట్లలో అతిశయోక్తులు కొత్తేమీ కాదు కానీ.. బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీక్వెన్సులు మాత్రం మరీ విడ్డూరంగా అనిపిస్తాయి.

బైకుని రౌండ్ తిప్పినట్లు ట్రాక్టర్‌ను రౌండ్ తిప్పడం.. దుక్కి దున్నడానికి ఉపయోగించే మరలతో హీరో పోలీసులను పొడిచి చంపడం.. చక్కిలిగింతలు పెట్టినట్లుగా కత్తితో పోట్లు పొడవడం.. ఇవన్నీ బోయపాటికే చెల్లింది. ట్రైలర్లో ఈ షాట్లు చూసి ప్రేక్షకులకు కళ్లు బైర్లు కమ్మాయి. బోయపాటి అంటే ఈ మాత్రం అతి మామూలే అని అన్నింటికీ ప్రిపేరయ్యే థియేటర్లకు వెళ్లారు. ఐతే యాక్షన్ సీన్లలో ఎంత అతి అయినా ఓకే.. లాజిక్కులు లేకున్నా పర్వాలేదు కానీ.. కథ, పాత్రల విషయంలో మినిమం సెన్స్ ఉంటుందని అనుకుంటే.. పూర్తి సెన్స్‌లెస్‌గా, మైండ్‌లెస్‌గా నడిపించేశాడు బోయపాటి.

విలన్లు ఇద్దరినీ ముఖ్యమంత్రులుగా చూపించి.. వాళ్లతో హీరో ఫుట్‌బాల్ ఆడుకున్నట్లు చూపించడం మరీ విడ్డూరం. ఒక పల్లెటూరికి చెందిన మామూలు కుర్రాడు.. సెక్యూరిటీ మొత్తాన్ని ఆటాడించి సీఎం ఇళ్లలోకి వెళ్లిపోవడం.. సీఎం భయపడి నీకు కావాల్సింది తీసుకుపో అనడం.. ఇద్దరు సీఎం కూతుళ్లను హీరో సింపుల్‌గా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోవడం.. ఇలాంటి విడ్డూరాలెన్నో ‘స్కంద’లో ఉన్నాయి. తొలి సీన్లోనే ఒక గవర్నర్ వచ్చి ఒక సీఎంకు.. ఇంకో రాష్ట్రం సీఎం ఈయన అని పరిచయడం చేస్తాడు.

రాజకీయాల్లో ఉన్న వాళ్లలో ఒక సీఎంకు, ఇంకో సీఎం తెలియని పరిస్థితి ఉంటుందా? ఇక రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు వాళ్ల వాళ్ల రాజధానుల్లో ఉండి పరిపాలన చూసుకుంటారు కానీ.. ఎంతసేపూ పనీ పాటా వదిలేసి ఇద్దరూ ఒకే ఇంట్లో కూలబడి ఉండటం విడ్డూరాలకే విడ్డూరం. వాళ్లిద్దరూ బ్లాక్ మనీని మేనేజ్ చేయడం కోసం ఒక బిజినెస్ మ్యాన్‌తో డీల్ చేసే సీన్ కూడా మరీ సిల్లీగా అనిపిస్తుంది. బోయపాటికి ఇలాంటి విషయాలు తెలియక తీస్తాడా.. లేక ప్రేక్షకులను అంత తక్కువ అంచనా వేసి తనకు ఏమనిపిస్తే అది తీస్తాడా అన్నది తెలియదు కానీ.. వేరే భాషల వాళ్లెవ్వరైనా ఇలాంటి సినిమాలు చూస్తే మాత్రం తెలుగు చిత్రాల పరువు పోవడం ఖాయం.