గత వారం 22న విడుదలైన సప్త సాగరాలు దాటి సైడ్ ఏ వారం తిరక్కుండానే అమెజాన్ ప్రైమ్ లో వచ్చేసింది. కేవలం ఏడు రోజులకే స్ట్రీమింగ్ చేసేయడం చూసి కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే అనుకునేరు. శుభ్రంగా తెలుగు డబ్బింగ్ కూడా ఇచ్చేశారు. అయితే ఎలాంటి హడావిడి లేకుండా, గుట్టుచప్పుడు కాకుండా నిన్న అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. శాండిల్ వుడ్ లో ఈ మధ్య కాలంలో పెద్ద హిట్ సాధించిన వాటిలో దీనికి అగ్ర స్థానం ఇస్తున్నారు అక్కడి బయ్యర్లు. అలాంటిది ఇతర భాషల్లో అనువదించినప్పుడు కనీసం గ్యాప్ ఉండేలా చూసుకోవాలి కదా.
ఇలా చేయడం వల్ల క్రమంగా చిన్న సినిమాలు లేదా డబ్బింగ్ చిత్రాలను థియేటర్లో చూసే ఆడియన్స్ తగ్గిపోతారు. ఎలాగూ త్వరగా ఓటిటిలో వస్తుంది కదాని తేలిగ్గా తీసుకుంటే దాని ప్రభావం బయ్యర్ల మీద పడుతుంది. అద్దెలు కట్టుకుంటూ జనం లేక చివరికి నష్టాలు చూస్తారు. సప్త సాగరాలు రిలీజ్ కు ముందు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సురేష్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా ప్రమోషన్లు చేశాయి. అలాంటప్పుడు కనీసం ఓ పదిహేను రోజులు స్పేస్ దొరికితే హిట్టు ఫ్లాపు సంగతి పక్కనపెట్టి టికెట్ కొని చూద్దామనుకున్న కాసింత ప్రేక్షకులను ప్రోత్సహించినట్టు ఉండేది.
ఇప్పుడీ ఎమోషనల్ డ్రామా రెండో భాగం అక్టోబర్ 27న రాబోతోంది. కర్ణాటకలో క్రేజ్ ఉంది కానీ తెలుగులో ఇక డౌటే. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ప్రైమ్ లో రావడం చూశాక ఎవరికైనా ఎందుకు ఆసక్తి వస్తుంది. హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో ఈ సినిమా రెండో వారం కొనసాగుతోంది. ఈలోగా ఈ ట్విస్టు. ఓటిటి గ్యాప్ కు సంబంధించి మార్పులు తీసుకురావాలని నిర్మాతలు ఎంతగా ప్రయత్నిస్తున్నా అవి సఫలం కావడం లేదు. బ్లాక్ బస్టర్లే నెల తిరక్కుండా వస్తుంటే మీడియం రేంజ్ వి అంతకన్నా తక్కువలో వచ్చేయడం నేరమేమి కాదని చోటా ప్రొడ్యూసర్ల వెర్షన్. లాజికల్ గా కరెక్టే కానీ పూర్తిగా సమర్ధించేది కూడా కాదు.