తమన్‌ను తట్టుకోలేమంటున్న థియేటర్

తెలుగులో మాస్ సినిమాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వాలంటే తమన్ తర్వాతే ఎవరైనా అన్నట్లు తయారైంది కొన్నేళ్లుగా పరిస్థితి. కెరీర్ ఆరంభం నుంచి అతను పెద్ద పెద్ద సినిమాలకు పని చేస్తున్నాడు కానీ.. దేవిశ్రీ తర్వాతే అతను అన్నట్లు ఉండేది అప్పట్లో. కానీ గత నాలుగైదేళ్లలో దేవిని వెనక్కి నెట్టి దూసుకుపోతున్నాడు తమన్. అడపాదడపా విమర్శలు, కాపీ ఆరోపణలు కామన్ అయినా.. తమన్ డిమాండ్ ఏమీ తగ్గట్లేదు.

ఈ మధ్య మాస్ సినిమా అంటే చాలు తమన్ పూనకంతో ఊగిపోతున్నాడు. థియేటర్లలో స్పీకర్లు బద్దలయ్యే రేంజిలో హై రేంజ్ సౌండ్‌తో ఆర్ఆర్ ఇస్తున్నాడు. ‘అఖండ’ సినిమాకు తమన్ ఇచ్చిన స్కోర్ అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఆ సౌండుకి నిజంగానే స్పీకర్లు దెబ్బ తింటున్న విషయాన్ని యుఎస్‌లో కొన్ని థియేటర్ల యాజమాన్యాలు వెల్లడించడం చర్చనీయాంశం అయింది. ఇది తమన్‌కు మంచి ఎలివేషన్ లాగా ఉపయోగపడింది.

ఐతే బోయపాటి తర్వాతి సినిమా ‘స్కంద’కు ఇంకా ఉత్సాహంగా పని చేశాడు తమన్. ‘అఖండ’కు ఏమాత్రం తగ్గని స్థాయిలో సౌండ్ పొల్యూషన్ సృష్టించాడు. కాకపోతే ఈసారి ఆర్ఆర్‌లో ఎమోషన్ తగ్గి సౌండ్ మాత్రమే మిగిలింది. కంటెంట్ కూడా వీక్ కావడం వల్ల ఈసారి ఆర్ఆర్‌‌తో ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేకపోతున్నారు. కాగా మరీ ఇంత సౌండ్ పొల్యూషన్ అంటే థియేటర్లలో సౌండ్ సిస్టమ్ తట్టుకోవడం కష్టం అంటూ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

గుంటూరుకు చెందిన గౌరీ శంకర్ థియేటర్ యాజమాన్యం అయితే ట్విట్టర్లో ఒక అప్పీల్ కూడా ఇచ్చింది. తమన్‌ను ఎవరైనా కంట్రోల్ చేయాలని.. లేదంటే థియేటర్లలో సౌండ్ సిస్టమ్స్ తట్టుకోవడం కష్టమని ఆ సంస్థ ట్విట్టర్లో పేర్కొంది. ‘స్కంద’ సినిమా ప్రదర్శన సందర్భంగా సౌండ్ పొల్యూషన్ తట్టుకోలేక ప్రేక్షకులే.. సౌండ్ తగ్గించాలని విన్నపాలు చేశారని.. ఇది ప్రేక్షకులతో పాటు థియేటర్ల యాజామాన్యాలకు కూడా ఇబ్బందిగా మారిందని ఆ సంస్థ తెలిపింది. మరి ఇకనుంచైనా తమన్ కొంచెం ఆర్ఆర్ డోస్ తగ్గిస్తే బెటర్.