బ్ర‌హ్మోత్స‌వం పోయాక‌ అడ్డాల‌తో మ‌హేష్ ఏమ‌న్నాడు?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కెరీర్లోనే అతి పెద్ద డిజాస్ట‌ర్ల‌లో బ్ర‌హ్మోత్స‌వం ఒక‌టి. త‌న‌కు సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు లాంటి స్పెష‌ల్ ఫిలిం ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల‌తో కొన్నేళ్ల‌కే మ‌ళ్లీ జ‌ట్టు క‌ట్టాడు మ‌హేష్‌. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా క‌నీస స్థాయిలో కూడా ఆ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే ఆ స‌మ‌యానికి అతి పెద్ద డిజాస్ట‌ర్ల‌లో ఒక‌టిగా నిలిచింది.

ఈ సినిమా మీద సోష‌ల్ మీడియాలో జ‌రిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ఇది మ‌హేష్‌కు అవ‌మాన భారం మిగిల్చింద‌ని చెప్పొచ్చు. ఇలాంటి డిజాస్ట‌ర్ ఇచ్చాక ఎవ‌రికైనా దర్శ‌కుడి మీద కోపం రావ‌డం స‌హ‌జం. కానీ మ‌హేష్ మాత్రం త‌న‌తో చాలా బాగా మాట్లాడాడ‌ని.. త‌న‌కు అండ‌గా నిలిచాడ‌ని చెప్పాడు శ్రీకాంత్.
త‌న కొత్త చిత్రం పెద‌కాపు విడుద‌ల‌కు సిద్ధ‌మైన నేప‌థ్యంలో శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో బ్ర‌హ్మోత్స‌వం త‌ర్వాత మ‌హేష్ రెస్పాన్స్ ఏంటో వెల్ల‌డించాడు.

సినిమా పోయాక మ‌హేష్ త‌న‌తో మాట్లాడుతూ.. మ‌నం బాగానే ఉన్నాం క‌దా, కొన్నిసార్లు ఇలా అవుతుంటాయి అని ధైర్యం చెప్పిన‌ట్లు శ్రీకాంత్ తెలిపాడు. మ‌నం క‌ష్టంలో ఉన్న‌పుడు అండ‌గా నిలిచే వాళ్లు ఉండ‌టం ముఖ్య‌మ‌ని.. మ‌హేష్ అలాగే త‌న‌కు సపోర్ట్ ఇచ్చాడ‌ని అత‌ను చెప్పాడు.

ఇదిలా ఉండ‌గా.. త‌మ క‌ల‌యిక‌లో సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సీక్వెల్ వ‌చ్చే అవ‌కాశాలున్న‌ట్లు శ్రీకాంత్ సంకేతాలు ఇవ్వ‌డం విశేషం. నిర్మాత దిల్ రాజే ఈ ఆలోచ‌న చేశాడ‌ని.. ఒక రోజు తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు లేస్తే ఆ సినిమా సీక్వెల్ ఆలోచ‌న వ‌చ్చిందంటూ త‌న‌కు ఫోన్ చేసి చెప్పాడ‌ని.. ఇది ఈ మ‌ధ్యే జ‌రిగింద‌ని కూడా శ్రీకాంత్ చెప్ప‌డం విశేషం. ఐతే ఈ సినిమా కార్య‌రూపం దాల్చాలంటే క‌థ స‌హా అన్నీ కుద‌రాల‌ని.. కాబ‌ట్టి వేచి చూద్దాం అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.