టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం ఓ నిరంతర చర్చలా కొనసాగుతున్న సంగతి తెలిసిందే, ఎక్కడో ఒకచోట దేశంలో ఏదో ఒక ప్రాంతంలో డ్రగ్స్ పట్టుకోవడం, ఆ కేసులో విచారణ జరపడంతో టాలీవుడ్ లోని ఒకరో ఇద్దరికో ఆ వ్యవహారాలతో సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు రావడం జరుగుతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో నవదీప్ మరోసారి డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ డ్రగ్స్ వాడాడంటూ పోలీసులు ఆరోపిస్తున్నారు.
మాదాపూర్ లో రైడ్ సందర్భంగా రామ్ చంద్ అనే వ్యక్తి పట్టుబడ్డాడని, అతను ఇచ్చిన వాంగ్మూలంలో తనతో కలిసి నవదీప్ డ్రగ్స్ సేవించినట్టుగా వెల్లడించాలని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 16న నవదీప్ నివాసంలో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నవదీప్ ను నిందితుడిగా చేర్చిన అధికారులు తాజాగా ఈనెల 16న నవదీప్ ఇంట్లో సోదాలు జరిపారని తెలుస్తోంది.
మరోవైపు, తనను అరెస్ట్ చేయకూడదు అంటూ ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టును నవదీప్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో, సెప్టెంబర్ 19వ తేదీ వరకు నవదీప్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే హైకోర్టులో నవదీప్ కు సంబంధించిన కౌంటర్ ను నార్కోటిక్ బ్యూరో అధికారులు దాఖలు చేయబోతున్నారు. నవదీప్ ను విచారణ జరిపితే ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపడతాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో, హైకోర్టులో నవదీప్ కు సంబంధించి ఏ నిర్ణయం వెలువడబోతోంది అన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates