ఓటీటీలు వచ్చాక నటీనటులు, టెక్నీషియన్లకు అవకాశాలు పెరిగాయి. సినిమాల్లో అవకాశాలు తగ్గిన వాళ్లకు కూడా ఓటీటీలు ప్రత్యామ్నాయ వేదికలుగా మారి చేతి నిండా పని దొరుకుతోంది. వీటి వల్ల సినీ పరిశ్రమలో ఉపాధి పెరిగిందన్నది వాస్తవం. కానీ తన లాంటి వాళ్లకు మాత్రం ఓటీటీలు తలుపులు మూసేశాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు సీనియర్ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి.
ఓటీటీల రాకతో బోల్డ్ కంటెంట్ పెరిగిపోయిందని.. దీంతో ఆర్ట్ సినిమాలను పట్టించుకునేవారే కరవయ్యారని.. దీంతో తనలోని రచయిత, దర్శకుడు మౌనం వహించాల్సి వస్తోందని ఆయన అన్నారు. తాను కీలక పాత్ర పోషించిన ‘పెదకాపు’ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో మీడియాను కలిసిన భరణి.. ఓటీటీల తీరు పట్ల ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘దర్శకుడిగా నేను ‘మిథునం’ తీసి పదేళ్లు దాటింది. తర్వాత ఇంకో సినిమా చేయలేదు. నా తరహా కళాత్మక చిత్రాలు తీసే నిర్మాతలే కనిపించడం లేదు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ నాలాంటి వాళ్లకు తలుపులు మూసేశాయి. ఆర్ట్‌లో కూడా హింస, అసభ్యత కనిపించాల్సిందే అంటున్నారు. వాళ్లకు కావాల్సిన కంటెంటే ఇవ్వాలంటున్నారు. నేనేమో డబుల్ మీనింగ్ డైలాగులు కూడా రాయకుండా తప్పించుకుని వచ్చిన వాడిని.
ఆర్ట్ సినిమాలు తీసే పరిస్థితులు ఇంక ఎప్పటికీ రావా అనే ప్రశ్న వస్తుందేమో. ప్రస్తుతం అలాగే ఉంది పరిస్థితి. కానీ ఎప్పటికీ ఇలాగే ఉండదు. కొరివి కారం, పచ్చళ్లు అన్నీ తిన్నాక అనారోగ్యానికి గురై డాక్టర్ దగ్గరికి వెళ్తే బీరకాయ, పాలు అంటూ పత్యం చెబుతాడు. అలా పత్యం సినిమాలు కూడా వస్తాయి. రేపన్న రోజు ఒక సాత్వికమైన సినిమా అద్భుతంగా ఆడితే.. అందరూ అలాంటి సినిమాలపై దృష్టిపెడతారు. అలాంటి సినిమాల కోసం ఎదురు చూడాలి అంతే’’ అని భరణి అన్నారు.