క్రేజీ సీక్వెల్.. రీమేక్ కాకుండా డబ్బింగ్

ప్రస్తుతం టాలీవుడ్ లో రీమేక్స్ ట్రెండ్ నడుస్తుంది. పాత తమిళ కథలను వెతికి మరీ రీమేక్ చేస్తున్నారు. ఇటీవలే చిరంజీవి కూడా భోళా శంకర్ తో వేదాళం రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా హరీష్ శంకర్ డైరెక్షన్ లో తేరి రీమేక్ గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేస్తున్నాడు. ఇదే హరీష్ శంకర్ కాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘జిగర్తాండ’ ను తెలుగులో కొన్ని మార్పులతో ‘గద్దల కొండ గణేష్’ గా రీమేక్ చేశాడు.

ఇప్పుడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ‘జిగర్తాండ డబులెక్స్’ టైటిల్ తో సీక్వెల్ చేశాడు. లారెన్స్ , ఎస్ జే సూర్య కథానాయకులుగా నటిస్తున్నారు. ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. పైగా లారెన్స్ కి తెలుగులో మంచి మార్కెట్ కూడా ఉంది. అందుకే  ఈ సీక్వెల్ సినిమాను ముందు నుండే తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. దీంతో అదే టైటిల్ తెలుగులో డిజైన్ చేయించి పోస్టర్స్ వదిలారు. 

11న  టీజర్ రాబోతుంది. తెలుగులో కూడా ఒకేసారి టీజర్ రిలీజ్ చేస్తున్నారు. ఇక హరీష్ శంకర్ లాంటి వాళ్ళు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా మేకర్స్ ముందే ప్లాన్ చేసుకున్నారు. జిగర్తాండ సినిమాను మంచి ఎంటర్టైన్ మెంట్ మిక్స్ చేసి తెరకెక్కించిన కార్తీక్ ఈసారి డబులెక్స్ అంటూ డబుల్ ఎంటర్టైన్ మెంట్ రెడీ చేస్తున్నాడు. ఈ కోలీవుడ్ క్రేజీ సీక్వెల్ తెలుగులో డబ్బింగ్ మూవీగా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో ?