ఇంత ఓపిక ఎక్కడిది షారుఖ్ సాబ్  

మంచి హిట్ అయితే చాలనుకుంటే ఏకంగా బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా అవతరించే దిశగా పరుగులు పెట్టడంతో జవాన్ సక్సెస్ పట్ల షారుఖ్ ఖాన్ ఆనందం అంతా ఇంతా కాదు. మూడేళ్ళ క్రితం జీరో సినిమా డిజాస్టరయ్యాక చాలా గ్యాప్ తీసుకున్న కింగ్ ఖాన్ పని అయిపోయిందంటూ మధ్యలో కొన్ని కథనాలు కూడా వచ్చాయి. పఠాన్ తో తన సింహాసనం భద్రంగా ఉందని చాటిన బాద్షా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండటం తెలిసిన విషయమే. అయితే ఫ్యాన్స్ ట్వీట్లకు సమాధానాలు ఇవ్వడం, వాటిని రీ కోట్ చేస్తూ కృతజ్ఞతలు చెప్పడంలో మాత్రం తన శైలి ప్రత్యేకం.

నిన్న గంటల తరబడి షారుఖ్ ఇదే పని మీద ఉన్నాడు. మిచిగన్, స్విట్జర్లాండ్, జర్మనీ, బెల్జియం, ఆస్ట్రేలియా, శ్రీలంక, సింగపూర్, ఒడిశా, నేపాల్, న్యూయార్క్, మాంచెస్టర్, దుబాయ్, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, మదనపల్లి, బుషవల్, టొరంటో, నాగపూర్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి అభిమానులు పెట్టిన సెలబ్రేషన్ వీడియోలు, ఫోటోలకు వ్యక్తిగతంగా స్పందిస్తూ అందరికీ ఒకే సమాధానం కాకుండా అక్కడ సందర్భానికి తగ్గట్టు స్పందించడం నెటిజెన్లను ఆకట్టుకుంటోంది. టైం లైన్ మొత్తం వీటితోనే నిండిపోవడంతో ఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు.

నిజానికి ఒక వీడియో పెట్టేసి థాంక్స్ చెప్పినా షారుఖ్ ని ఎవరూ తప్పుబట్టరు. కానీ అదే పనిగా ఇలా ఆన్ లైన్ లో ఒక్కొక్కరికి రెస్పాన్స్ ఇవ్వడం చూస్తే నిజంగా ఈ ఓపికకు దండం పెట్టాల్సిందే. మొదటిరోజు 129 కోట్లతో ఆదిపురుష్ తర్వాతి స్థానాన్ని తీసుకున్న జవాన్ రెండో రోజు సైతం అదే దూకుడు చూపించింది. వీకెండ్ అయ్యేలోపు మతిపోయే రికార్డులు నమోదు కావడం ఖాయమే అనిపిస్తోంది. భాషతో సంబంధం లేకుండా ఒక సాధారణ యాక్షన్ ఎంటర్ టైనర్ ని కేవలం తన టేకింగ్ తో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన అట్లీకి కొత్తగా నార్త్ లో ఫ్యాన్ అసోసియేషన్లు మొదలయ్యేలా ఉన్నాయి.