మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. ఇంకో రెండు రోజుల్లో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న సినిమా ఇది. అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టిల క్రేజీ కాంబినేషన్లో యువ దర్వకుడు మహేష్ బాబు ఈ చిత్రాన్ని రూపొందించాడు. అనుష్క, నవీన్‌ల ఇంటిపేర్లనే తీసుకుని ఈ సినిమాకు టైటిల్ పెట్టడం అందరి దృష్టినీ ఆకర్షించింది. మరి ఈ టైటిలే ఎందుకు పెట్టారు.. ఆ ఆలోచన ఎలా వచ్చింది అన్నది ఆసక్తికరం.
దీని వెనుక స్టోరీని నవీన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘‘మా సినిమాను అనౌన్స్ చేశాక దానికి సంబంధించిన వార్తకు ఒక పేపర్లో ‘శెట్టితో పొలిశెట్టి’ అని హెడ్డింగ్ పెట్టారు. ఇదేదో బాగుందే దీని మీదే టైటిల్ ఎందుకు పెట్టకూడదు అనిపించి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అని పేరు పెట్టాం. సినిమాలో పాత్రల పేర్లు కూడా అవి కలిసి వచ్చేలాగే పెట్టుకున్నాం. అలా దీనికి టైటిల్ ఖరారైంది’’ అని నవీన్ వెల్లడించాడు. పేపర్లలో వచ్చే వార్తలను బట్టి కథలు తయారు కావడం మామూలే కానీ.. ఇలా హెడ్డింగ్ చూసి సినిమా టైటిల్ నిర్ణయించడం అరుదే.
ఇక ‘జాతిరత్నాలు’కు.. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’కి మధ్య చాలా గ్యాప్ రావడం గురించి నవీన్ స్పందిస్తూ.. ‘‘జాతిరత్నాలు సినిమా ముందే రెడీ అయినా.. కరోనా వల్ల రిలీజ్ ఆలస్యం అయింది. ఆ సినిమా రిలీజ్ టైంకి కూడా కరోనా ప్రబావం కొనసాగుతోంది. అప్పటికి ఇంకా ఎన్ని వేవ్‌లు ఉంటాయో.. ఎంత కాలం దాని ప్రభావం కొనసాగుతోంద అర్థం కాలేదు.
ఆ గందరగోళం మధ్య షూటింగ్ వద్దనుకుని ఊరుకున్నా. కరోనా ప్రభావం పూర్తిగా పోయాకే ఈ సినిమా షూట్ మొదలుపెట్టాం. గత ఏడాదంతా చిత్రీకరణ జరిగింది. ఈ ఏడాది మేకు రిలీజ్ అనుకున్నాం. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్ల సినిమా ఇంత ఆలస్యం అయింది. కానీ ఇకపై నా నుంచి ఇంత గ్యాప్ ఉండదు. ఇకపై వరుసగా సినిమాలు చేస్తా. ఏడాదికి రెండు రిలీజ్‌లు ఉండేలా చూసుకుంటా’’ అని నవీన్ పొలిశెట్టి వివరించాడు.