ప్రాంతీయ స్థాయిలో, ఒక లోకల్ లాంగ్వేజ్‌లో ఓటీటీ ఫ్లాట్ ఫాంను మొదలుపెట్టి సక్సెస్ చేయొచ్చని చూపించిన వ్యక్తి అల్లు అరవింద్. ‘ఆహా’ పేరుతో ఓటీటీని అనౌన్స్ చేసినపుడు ఇదెంత వరకు ఆకట్టుకుంటుందో.. విజయవంతమవుతుందో అని సందేహించారు కానీ.. లాక్ డౌన్ బాగా కలిసి రావడంతో లిమిటెడ్ కంటెంట్‌తోనే ‘ఆహా’ అనుకున్నదానికంటే పెద్ద సక్సెస్సే అయింది.
ఐతే ఓటీటీల వ్యవహారం అంతా వేరు. ఈ రోజున్న కంటెంట్ చూసి వావ్ అనుకునే ప్రేక్షకుడు.. అది పూర్తయ్యాక ఇంకేముందన్నట్లుగా చూస్తాడు. సబ్స్క్రిప్షన్ కొనసాగించాలంటే కొత్త కంటెంట్ ఇస్తూనే ఉండాలి. అందులో క్వాలిటీ ఉండాలి. నిరంతరం సంతృప్తి పరిస్తే తప్ప సబ్స్క్రైబర్లు కొనసాగరు. కొత్త కొత్త సినిమాలకు తోడు ఒరిజినల్ కంటెంట్ ఇవ్వడం కీలకం. ఈ విషయంలో ‘ఆహా’ మిగతా ఫ్లాట్‌ఫామ్స్‌తో పోలిస్తే వెనుకబడే ఉంది. ఇందులో తెలుగు సినిమాలు కొత్తవి ఎప్పుడో కానీ రావట్లేదు. పెద్ద సినిమాల గురించి ఆలోచించే పరిస్థితే లేదు.
ఆహా సొంతంగా ప్రొడ్యూస్ చేసిన వెబ్ సిరీస్‌ల్లో క్వాలిటీ అంతంతమాత్రమే. తాజాగా వచ్చిన ‘మెట్రో కథలు’ కూడా జస్ట్ ఓకే అనిపించిందంతే. ఖర్చు విషయంలో మరీ పొదుపు పాటించినట్లు అనిపించింది. ఇక ‘ఆహా’లోకి వరుసగా తమిళ, మలయాళం సినిమాల అనువాదాల్ని తీసుకొస్తున్నారు. షైలాక్, ట్రాన్స్, ఫోరెన్సిక్ లాంటి సినిమాలు ఇలాగే రిలీజయ్యాయి.
ఇవి ఆల్రెడీ తెలుగులోకి అనువాదమైనవి కాదు. ‘ఆహా’ కోసమే ప్రత్యేకంగా అనువదించారు. ఐతే మంచి క్వాలిటీ ఉన్న ఈ సినిమాలకు చేసిన డబ్బింగ్ వర్క్ మాత్రం నాసిరకంగా ఉంది. ‘సీఐడీ’ సహా కొన్ని హిందీ సీరియళ్లలో వినిపించిన మొరటు వాయిస్‌లు ఇందులో వినిపించాయి. ఆ వాయిస్‌లు వింటేనే ఒక తక్కువ స్థాయి అభిప్రాయం కలుగుతోంది.
ఇక టైటిళ్లలో మలయాళ నటుల పేర్లను వేస్తున్న తీరు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ‘ఫోరెన్సిక్’ సినిమాలో నటించిన మమతా మోహన్ దాస్ మనవాళ్లకు ఇది వరకే పరిచయం. ఈ సినిమా టైటిళ్లలో ఆమె పేరు ‘మంథ’ అని వేశారు. ఈ చిత్రంలో హీరోకు వాడిన్ వాయిస్ అయితే మరీ దారుణం. డబ్బింగ్ విషయంలో ఏమాత్రం క్వాలిటీ, కేర్ పాటిస్తున్నారనడానికి ఇది రుజువు.
మామూలుగా తమిళ డబ్బింగ్ సినిమాలకు కాస్త పేరున్న డబ్బింగ్ ఆర్టిస్టులతో పని చేయించుకుంటారు. ఐతే ఆ మాత్రం ఖర్చు చేయడానికి కూడా ‘ఆహా’ వాళ్లు వెనకాడుతున్నట్లుంది. డబ్బింగ్ కోసం మరీ తక్కువ బడ్జెట్ పెడుతున్నారో ఏమో.. ఈ అనువాద చిత్రాల స్థాయిని దెబ్బ తీసేలా ఉంటున్నాయి వాయిస్. ఈ విషయంలో అప్రమత్తం కాకపోతే ‘ఆహా’ పేరు దెబ్బ తినడం ఖాయం.