నేను బాలేనని రిజెక్ట్ చేశారు-బన్నీ

‘గంగోత్రి’ సినిమాలో అల్లు అర్జున్‌ను చూసిన వాళ్లకు.. అతను ఒక హీరోగా ఇప్పుడున్న స్థాయికి ఎదుగుతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన బన్నీ.. తాజాగా ‘పుష్ప’ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకుని తెలుగు సినీ పరిశ్రమకే గర్వ కారణంగా నిలిచాడు. ఇప్పుడీ స్థాయిని అందుకున్న కెరీర్ ఆరంభంలో పడ్డ ఇబ్బందుల గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకు కూడా అవమానాలు తప్పలేదని వెల్లడించాడు. ‘గంగోత్రి’ సినిమాకు ముందు, తర్వాత తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బన్నీ మాటల్లోనే తెలుసుకుందాం.

‘‘నా అరంగేట్రం అంత సాఫీగా ఏమీ జరగలేదు. నా చదువు పూర్తయిన తర్వాత ఒక పెద్ద బేనర్లో నాకు ఆఫర్ వచ్చింది. కానీ తర్వాత నేను బాలేనని రిజెక్ట్ చేశారు. అప్పుడు నాన్న, చిరంజీవి గారు చాలా బాధ పడ్డారు. నన్ను పెట్టి సొంతంగా సినిమా తీయాలనుకున్నారు. ఆ సమయంలో రాఘవేంద్రరావు గారి నుంచి ‘గంగోత్రి’ ప్రపోజల్ వచ్చింది. నాన్న, అశ్వినీదత్ గారు, చిన్నికృష్ణ గారు.. ఇలా అందరూ కలిసి ఆ ప్రాజెక్ట్ సెట్ చేశారు. అదే.. గంగోత్రి. ఆ సినిమా పెద్ద హిట్టయింది.

కానీ నటుడిగా నేను ఫెయిలయ్యాను. ఆ సినిమా సమయానికి ఒక నటుడిగా నేను సిద్ధంగా లేను. చిన్నప్పట్నుంచి నేను ఫెయిల్యూరే, మళ్లీ ఫెయిల్యూరా.. అనుకున్నాను. నాన్న కూడా వెంటనే నన్ను పెట్టి సినిమా తీయలేని పరిస్థితి. ఆ సమయంలో సినిమా తీయడం అంత సులువు కాదు. ఐతే నాకు నటన వచ్చని నమ్మేవాడిని. ఆ సమయంలోనే దిల్ రాజు గారు వచ్చి ‘కొత్త వాళ్లతో ఆర్య సినిమా తీస్తున్నాం’ అని చెప్పారు. ఆ సినిమా చేశాక నేను వెనుదిరిగి చూసుకోలేదు. ముళ్లబాటలో ఉన్న వాడిని రోడ్డు మీదికి వచ్చా’’ అని బన్నీ గుర్తు చేసుకున్నాడు.