పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై ఎవరూ ఊహించని రీతిలో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న బేబీ వంద కోట్ల గ్రాస్ మైలురాయిని అందుకోవడానికి ఫైనల్ రన్ దగ్గర నానా తిప్పలు పడుతోంది. బ్రో రాక ముందే 75 కోట్లను దాటేసిన ఈ కల్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత థియేటర్లు తగ్గిపోయి ఇబ్బందులు ఎదురుకుంది. జైలర్, భోళా శంకర్, గదర్ 2, ఓ మై గాడ్ 2 అన్నీ ఒకేసారి ఇండిపెండెన్స్ డేని లక్ష్యంగా పెట్టుకుని రావడంతో చాలా మటుకు స్క్రీన్లలో కోత పడింది. అప్పటిదాకా మంచి దూకుడు మీదున్న బేబీ హఠాత్తుగా స్పీడ్ తగ్గించుకోవాల్సి వచ్చింది.
విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, చిరంజీవి ఇలా పెద్ద స్టార్లతో దగ్గరుండి ఈవెంట్లు చేయించి దానికి తగ్గ ఫలితం అందుకున్న బేబీ టీమ్ ముందున్న లక్ష్యం ఇంకొక్క పది కోట్ల గ్రాస్. వినడానికి చిన్న మొత్తంగా అనిపిస్తున్నా అంత సులభమైతే కాదు. ఎందుకంటే పబ్లిక్ జైలర్ మత్తులో ఉన్నారు. ఇంకా చూడని జనాలు బోలెడు. పైగా కొత్త చిత్రాల తాకిడికి బేబీ మీద ఆసక్తి దాదాపుగా జీరోకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితిలో వంద మైలురాయి కష్టమే. ఆనంద్ దేవరకొండ డాన్స్ చేసిన కొత్త పాటతో పాటు మరికొన్ని సన్నివేశాలు జోడించినా దాని ప్రభావం కలెక్షన్ల మీద అంతగా లేదన్నది తేటతెల్లం.
ఇంత జరిగినా బేబీ చాలా సాధించిందన్నది మాత్రం వాస్తవం. దర్శకుడు సాయి రాజేష్ డెబ్యూతోనే యాభై కోట్ల షేర్ దాటే మూవీ అందుకోవడమంటే మాటలు కాదు. తాను విపరీతంగా ఆరాధించే చిరంజీవి సినిమానే టాక్ తేడా కొట్టి ఆ మార్కు దాటడం అసాధ్యంగా కనిపిస్తున్న పరిస్థితుల్లో బేబీ కొట్టిన సిక్సర్ స్టేడియం దాటి దొరకనంత దూరం పడినట్టే. సరే ఈ వారం పది రోజుల్లో హండ్రెడ్ క్రోర్ కిరీటం వస్తుందేమోననే ఆశతో టీమ్ ఎదురు చూస్తోంది. ఒకవేళ బ్రో కొంత లేట్ అయినా జైలర్ ఫ్లాప్ అయినా ఈపాటికి ఆ కల నెరవేరేది కానీ ఇప్పుడు మాత్రం వెయిటింగ్ తప్పడం లేదు.