ఖుషి బిజినెస్ ఇంత క్రేజీగానా

పవన్ కళ్యాణ్ ఆల్ టైం క్లాసిక్ టైటిల్ వాడుకున్నారని తొలుత విజయ్ దేవరకొండ ఖుషి మీద ఫ్యాన్స్ నుంచి కొంత ప్రతికూలత వచ్చింది క్రమంగా ప్రమోషన్లు పెరిగే కొద్దీ అదంతా మాయమైపోయి బజ్ పెరుగుతోంది. నిన్న జరిగిన లైవ్ మ్యూజికల్ కన్సర్ట్ లో సమంతతో కలిసి రౌడీ బాయ్ ఆడిపాడిన తీరు ఆడియన్స్ లోకి బాగా వెళ్ళింది. హీరో, దర్శకుడు, హీరోయిన్ ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా బిజినెస్ చాలా క్రేజీగా జరుగుతోందని ట్రేడ్ టాక్. థియేట్రికల్ హక్కులను సుమారు 60 కోట్లకు విక్రయించినట్టు వచ్చిన వార్త అభిమానులకే కాదు అందరికీ షాక్ కలిగిస్తోంది.

ఒక రామ్ కామ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ కి ఇంత రేట్ పలకడం అనూహ్యం. లైగర్ ని 90 కోట్లకు అమ్మారు. కానీ దానికైన బిజినెస్, కాంబో లెక్కలు వేరు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి జగన్నాధ్ మూవీ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు ముందు వెనుక ఆలోచించలేదు. కానీ ఖుషి అలా కాదు. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ ఉన్నప్పటికీ అన్ని భాషల్లో ఒకే రకమైన హైప్ లేదు. అయినా సరే కంటెంట్ యునివర్సల్ గా నచ్చేది కాబట్టి ఇలా ప్లాన్ చేశామని విజయ్ దేవరకొండ ట్రైలర్ లాంచ్ లో చెప్పిన సంగతి తెలిసిందే. నెంబర్ల పరంగా ఖుషి తగ్గినట్టు అనిపించినా తక్కువ చేసే మొత్తమైతే కాదు.

సో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం తొంభై కోట్ల గ్రాస్ దాటాల్సిందే.  బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అదేమంత అసాధ్యం కాదు. పంపిణి పరంగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ రిలీజ్ ని ప్లాన్ చేసింది. ఆ రోజు పెద్దగా పోటీ లేదు. సరిపడా థియేటర్లు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి. ఆల్రెడీ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం యూత్ కి బాగా ఎక్కేసింది. విజయ్ సామ్ ల కెమిస్ట్రీ తెరమీద బాగా పండిందని ట్రైలర్, నిన్న ఈవెంట్ చూశాక క్లారిటీ వచ్చింది. స్క్రీన్ మీద కూడా అదే స్థాయిలో పండితే మాత్రం విజయ్ దేవరకొండకు ఎన్నాళ్ళో వేచిన ఉదయం వచ్చేసినట్టే. ఇంకో రెండు వారాల్లో తేలిపోతుంది.