చాలా గ్యాప్ తర్వాత స్వీటీ అనుష్కని ఎప్పుడెప్పుడు తెరమీద చూద్దామా అని ఎదురు చూస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విడుదల ఎట్టకేలకు సెప్టెంబర్ 7కి లాక్ చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. గత కొద్దిరోజులుగా యువి టీమ్ దీని మీద తీవ్ర తర్జనభర్జనలు చేసింది. ఒకటో తేదీ వద్దామంటే విజయ్ దేవరకొండ ఖుషి ఉంది. పోనీ మూడో వారం వద్దామంటేనేమో స్కంద, చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీలు కాచుకుని ఉన్నాయి. దీని కంటే షారుఖ్ ఖాన్ జవాన్ ని ఫేస్ చేయడమే ఈజీ అని భావించిన నిర్మాతలు ఫైనల్ గా ఏడుకే ఓటు వేశారు. ఇక్కడిదాకా బాగానే ఉంది.
చేతిలో ఉన్న ఇరవై రోజుల్లో ప్రమోషన్లు పీక్స్ కు చేరుకోవాలి. ఎందుకంటే జవాన్ ని మరీ తక్కువంచనా వేయడానికి లేదు. తీసింది మన టేస్ట్ కి దగ్గరగా ఉండే తమిళ దర్శకుడు ఆట్లీ కాబట్టి కంటెంట్ కనెక్ట్ అయ్యిందా ఇక్కడా వసూళ్ల వర్షం కురుస్తుంది. పఠాన్ లో సౌత్ స్టైల్ కమర్షియల్ యాక్షన్ లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. అలాంటిది నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకునే లాంటి ఆకర్షణలు ఉన్న జవాన్ మీద ఆటోమేటిక్ గా బజ్ వచ్చేస్తుంది. వీటికన్నా ఎక్కువ అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ కోసమే సినిమాలకు వెళ్లే యూత్ పెరుగుతున్నారు.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుంది. హీరో నవీన్ కిందటి నెల నుంచే ఎడతెరిపి లేకుండా ఏదో ఒక రూపంలో ప్రమోషన్లు చేస్తూనే ఉన్నాడు. అసలైన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఒక పబ్లిక్ వేడుకలో అనుష్క మాట్లాడ్డం చూసి సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడేం చెబుతుందో ఎలా ఉంటుందోననే ఉత్సుకత ఫ్యాన్స్ లో ఉంది. తానుగా కోరుకుని బ్రేక్ తీసుకుంది కానీ అనుష్క కోరుకుంటే ఆఫర్లకు కొదవలేదు. మరి ఈ సినిమా కనక హిట్ అయితే కంటిన్యూ అవుతుందో లేదోననే సస్పెన్స్ లేకపోలేదు.