బాలీవుడ్ మూవీ మాఫియా మీద అలుపెరగని పోరాటం చేస్తోంది కంగనా రనౌత్. కొన్నిసార్లు తన మద్దతుదారులకు కూడా అసహనం కలిగేలా కంగనా ప్రవర్తిస్తుంటుందనేది వాస్తవం. కానీ ఎవరేమన్నా ఆమె వెనక్కి తగ్గే ప్రసక్తి మాత్రం ఉండదు. ముఖ్యంగా స్టార్ కిడ్స్ను నెత్తిన పెట్టుకుని వాళ్లతోనే సినిమాలు చేసే, వాళ్లను అనేక రకాలుగా ప్రమోట్ చేసే కరణ్ జోహార్ అంటే ఆమెకు మామూలు మంట కాదు. ఇప్పటికి కరణ్‌ను ఎన్నిసార్లు తిట్టిపోసిందో.. అతడిపై ఎన్ని ఆరోపణలు చేసిందో లెక్కే లేదు. తాజాగా ఆమె మరోసారి కరణ్‌ను టార్గెట్ చేసింది. కరణ్‌కు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం విశేషం.
తనను బెదిరించడమే కాక.. యువ నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడటానికి కరణ్ కారకుడయ్యాడని.. ఇంకా అనేక ప్రతికూల కారణాలున్నాయని.. అందుకే కరణ్‌కు ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరింది. ‘‘భారత ప్రభుత్వానికి ఇదే నా విన్నపం దయచేసి కరణ్ జోహార్‌కు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోకండి. అందుకు ఆయన అర్హుడు కాదు. ఆయన నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోమని బెదిరించారు. సుశాంత్ కెరీర్ నాశనం కావడానికి ఆయనే కారణం. అంతే కాదు.. పాకిస్థాన్‌కు అనుకూలంగా, మన భద్రతా దళాలను కించపరిచేలా జాతి వ్యతిరేక సినిమాలు కూడా తీశారు’’ అని కంగనా తాజాగా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశం అవుతోంది. కథానాయికగా నిలదొక్కుకోవడానికి ముందు తనను ఇబ్బంది పెట్టిన బాలీవుడ్ బడాబాబులందరినీ కంగనా కొంత కాలంగా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates