వేదాళం ఉన్న‌దున్న‌ట్లు తీసి ఉంటే..?

ఈ రోజుల్లో రీమేక్ సినిమాలంటేనే ప్రేక్ష‌కుల్లో స‌గం ఆస‌క్తి చ‌చ్చిపోతోంది. అందులోనూ ఏ కొత్త‌ద‌నం లేని రొటీన్ మాస్ మ‌సాలా సినిమాల‌ను రీమేక్ చేస్తుంటే..స్టార్ హీరోల అభిమానులే వాటిని వ్య‌తిరేకిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వేదాళం రీమేక్‌ను అనౌన్స్ చేసిన‌పుడు మెగా ఫ్యాన్స్ తీవ్రంగానే వ్య‌తిరేకించారు. అందులోనూ మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ట‌ర్ అంటే ఇంకా గ‌గ్గోలు పెట్టారు. అయినా చిరు ఆగ‌లేదు.

అత‌డి ద‌ర్శ‌క‌త్వంలోనే వేదాళంను రీమేక్ చేశాడు. ఫ‌లితం ఏమైందో తెలిసిందే. నిజానికి వేదాళంను ఉన్న‌దున్న‌ట్లుగా తీసినా స‌రే.. కాస్త మెరుగైన ఫ‌లితం వ‌చ్చేదేమో అన్న అభిప్రాయాలు భోళాశంక‌ర్ చూసిన వాళ్ల‌కు క‌లుగుతున్నాయి. ఎంత రొటీన్ మాస్ మూవీనే అయిన‌ప్ప‌టికీ.. వేదాళం చూడ‌ద‌గ్గ సినిమానే. అందులో హీరోయిజం ఎలివేష‌న్ సీన్లు, యాక్ష‌న్ సీక్వెన్సులు ఒక రేంజిలో ఉంటాయి.

కానీ త‌మిళంలో హైలైట్ అనుకున్న సీన్లు తెలుగులోకి వ‌చ్చేస‌రికి తేలిపోయాయి. అమాయ‌కంగా క‌నిపించే అజిత్.. త‌న రెండో కోనాన్ని చూపించే సీన్ వేదాళంకు హైలైట్. హీరోయిజాన్ని ఒక రేంజిలో ఎలివేట్ చేసే సీన్ అది. కానీ ఆ సీనే లేపేశాడు మెహ‌ర్ ర‌మేష్‌. అదో పెద్ద మైన‌స్. ఇక అజిత్ పాత్ర త‌మిళంలో అమాయ‌కంగా.. చాలా వ‌ర‌కు సీరియ‌స్‌గా క‌నిపిస్తే తెలుగులో చిరంజీవి క్యారెక్ట‌ర్‌ను మాత్రం కామెడీగా డీల్ చేశారు. అజిత్ ముందు ఎంత అమాయ‌కంగా క‌నిపిస్తాడో.. ఆ త‌ర్వాత అంత వ‌యొలెంట్‌గా క‌నిపిస్తాడు.

తెలుగులో చిరు పాత్ర‌ను అంత వ‌యొలెంట్‌గా ప్రెజెంట్ చేయ‌లేదు. ఎందుకో ఆ పాత్ర‌లో ఎక్క‌డా ఇంటెన్సిటీ క‌నిపించ‌లేదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అయితే ఖుషి న‌డుము సీన్ లాంటివి పెట్టి ఆ పాత్ర ఔచిత్యాన్ని పూర్తిగా దెబ్బ తీశారు. ఇలాంటి సీన్ల‌ త‌ర్వాత హీరో పాత్ర‌ను ఎలా సీరియ‌స్‌గా తీసుకుంటారు ప్రేక్ష‌కులు? ఇలా మార్పులు చేర్పులు సినిమాలో దారుణంగా బెడిసికొట్టి.. భోళాశంక‌ర్ ఒరిజిన‌ల్ ముందు తేలిపోయింది. క‌నీసం వేదాళంను ఉన్న‌దున్న‌ట్లు తీసినా భోళాశంక‌ర్‌కు ఇంత ఘోర‌మైన రిజ‌ల్ట్ వ‌చ్చేది కాదేమో.