బేబి.. 5 గంటల 25 నిమిషాలు

టాలీవుడ్లో చరిత్రలోనే చిన్న సినిమాల్లో అతి పెద్ద విజయాల్లో ఒకటిగా ‘బేబి’ని చెప్పొచ్చు. పెద్దగా పేరు లేని హీరో హీరోయిన్లను పెట్టి దర్శకుడిగా ఒక సినిమా అనుభవం ఉన్న సాయి రాజేష్ తీసిన ఈ చిత్రం ఇప్పటిదాకా రూ.80 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అన్నీ కలిసొస్తే ఈ చిత్రం రూ.100 కోట్ల మార్కును కూడా అందుకున్నా ఆశ్చర్యం లేదు. ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా నిడివి దాదాపు 3 గంటలు కావడం విశేషం. ‘రంగస్థలం’, ‘అర్జున్ రెడ్డి’ లాంటి చిత్రాలు మూడు గంటల

నిడివితోనే ఘనవిజయాన్నందుకున్న మాట వాస్తవమే కానీ.. ‘బేబి’ లాంటి చిన్న చిత్రం ఇంత రన్ టైంతో మెప్పిస్తుందా అనే ప్రశ్నలు విడుదలకు ముందు తలెత్తాయి. కానీ ఆ అనుమానాలేమీ పెట్టుకోకుండా టీం ముందుకు వెళ్లిపోయింది. మంచి ఫలితాన్నందుకుంది. కానీ ఈ సినిమా షూట్ అయ్యాక తేలిన నిడివి ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. అది ఏకంగా.. 5 గంటల 25 నిమిషాలట. ఈ విషయాన్ని దర్శకుడు సాయి రాజేషే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు.

‘బేబి’ చిత్రానికి ముందు వేరే ఎడిటర్ ఉండేవారని.. అతనున్న సమయానికి రష్ చూస్తే 5 గంటలు దాటిపోయిందని.. అది చూసి నిర్మాత ఎస్కేఎన్‌కు గుండె బద్దలైపోయిందని సాయి రాజేష్ తెలిపాడు. అప్పుడు ఈ సినిమాను ఎలా కట్ చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి అందరం వచ్చామని.. ఆ టైంలో ఈ ప్రాజెక్టులోకి ఎడిటర్ నైషద్ వచ్చాడని.. అతనొచ్చి లాంగ్ షాట్లు అన్ని కట్ చేస్తూ వెళ్లినా సరే ఫస్టాఫ్ గంటా 50 నిమిషాలకు పైగా, సెకండాఫ్ 2 గంటలకు పైగా వచ్చిందని సాయిరాజేష్ తెలిపాడు.

అప్పుడు చూసుకున్నా ప్రతి సీన్ బాగుందనే అనిపించిందని.. ఈ సినిమా రన్ టైం ఎలా తగ్గించాలో తెలియక అందరం తలలు పట్టుకున్నామని సాయి రాజేష్ వెల్లడించాడు. చివరికి ఎస్కేఎన్, మారుతి కలిసి కూర్చుని వీలైనంత మేర సినిమాను కట్ చేస్తూ వెళ్లారని.. చివరికి 3 గంటల రన్ టైం ఫైనలైజ్ అయిందని.. మారుతితో పాటు బన్నీ వాసు కూడా ఇంతకుమించి తగ్గించకూడదని.. సినిమాను ఆ రన్ టైంతోనే రిలీజ్ చేయాల్సిందే అని నిర్ణయించుకుని రిలీజ్‌కు వెళ్లామని సాయిరాజేష్ వెల్లడించాడు.