బాలు మాట్లాడుతున్నారు.. మనుషుల్ని గుర్తిస్తున్నారు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీద జనాలకు ఎంతటి ప్రేమాభిమానాలు ఉన్నాయి గత కొన్ని రోజుల్లో బాగా తెలిసొచ్చింది. కరోనా బారిన పడ్డ బిలు.. పరిస్థితి విషమించి ఐసీయూలో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారన్న సమాచారం బయటికి రాగానే తమ ఇంట్లో మనిషి ఆ స్థితిలో ఉన్నట్లుగా జనాలు బాధ పడ్డారు. తన పాటలతో అపరిమిత ఆనందాన్ని ఇచ్చిన ఆయన్ని ఇంత త్వరగా ఎలా తీసుకుపోతావంటూ దేవుణ్ని ప్రశ్నించారు. ఆయన క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తన్నారు. వారి ప్రార్థనలు ఫలించే బాలు కొద్ది కొద్దిగా కోలుకుంటున్నారు. మొన్నటి పరిస్థితి చూస్తే ఆయన ప్రాణాపాయం తప్పించుకున్నట్లే కనిపిస్తున్నారు. బాలు ఆరోగ్య స్థితిపై ఆయన కొడుకు ఎప్పీ చరణ్ తాజాగా మరోసారి అప్ డేట్ ఇచ్చారు.

బాలు పరిస్థితి మరింత మెరుగు పడిందని.. ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికీ వెంటిలేటర్ మీదే ఉన్నప్పటికీ.. ఆయన బాగా శ్వాస తీసుకోగలుగుతున్నారని చరణ్ వెల్లడించాడు. బాలుకు ప్రస్తుతం మత్తు మందు ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఆయన తెలివిలోకి వచ్చారని.. మనుషుల్ని గుర్తిస్తున్నారని.. కొద్ది కొద్దిగా మాట్లాడుతున్నారని చెప్పాడు. వైద్యులను చూస్తూ థమ్సప్ కూడా చెప్పారని.. ఇప్పుడుంటున్న ఆసుపత్రి కామన్ ఐసీయూ నుంచి వేరే ఫ్లోర్‌లో ఉన్న స్పెషల్ ఐసీయూకు బాలును మార్చారని.. డాక్టర్లు అత్యంత జాగ్రత్తగా ఆయన్ని చూసుకుంటున్నారని.. బాలు కోలుకుని ఇంటికి రావడానికి సమయం పడుతుందని.. అప్పటి వరకు ఆయనకు ఏమీ జరగొద్దని ప్రార్థనలు కొనసాగించాలని.. ఆయన ఈ మాత్రం కోలుకున్నారన్నా అది అభిమానుల ప్రేమాభిమానాల వల్లే అని చరణ్ అన్నాడు. కరోనా బారిన పడ్డ తన తల్లి కోలుకుని ఆసుపత్రికి వచ్చేయడం మరో సంతోషకరమైన విషయం అని.. ఆమె బాటలోనే తన తండ్రి కూడా ఇంటికి వచ్చేస్తారని చరణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.