ఇంత పోటీలో, మూడో వీకెండ్లోనూ హౌస్ ఫుల్స్

యూత్‌కు న‌చ్చింది.. ఎగ‌బ‌డి చూస్తున్నారు అంటే ఏదో వారం ప‌ది రోజులే అనుకున్నారు కానీ.. బేబి సినిమా మూడో వారంలోనూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షిస్తున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. రెండు వారాల్లో రూ.70 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్ల‌తో ఔరా అనిపించిన ఈ చిన్న సినిమా.. మూడో వారంలోనూ త‌గ్గ‌ట్లేదు. ఈ వారం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-సాయిధ‌ర‌మ్ తేజ్‌ల‌ బ్రో మూవీ పాటు హిందీ మూవీ రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ క‌హాని లాంటి పెద్ద హిందీ చిత్రం రిలీజ్ కావ‌డం, ముందు వారంలో వ‌చ్చిన ఓపెన్ హైమ‌ర్, బార్బీ చిత్రాల‌కు మ‌ల్టీప్లెక్సుల్లో చాలా స్క్రీన్లు కొన‌సాగిస్తుండ‌టంతో బేబికి థియేట‌ర్లు, షోల కౌంట్ బాగా త‌గ్గింది.

అయినా స‌రే.. అందుబాటులో ఉన్న థియేట‌ర్ల‌లో ఈ సినిమాకు మంచి ఆక్యుపెన్సీలు క‌నిపిస్తున్నాయి. శ‌ని, ఆదివారాల్లో ఈ చిత్రం హౌస్ ఫుల్స్‌తో ర‌న్ అయింది.
బ్రో సినిమా త‌ర్వాత ప్రేక్ష‌కుల సెకండ్ ఛాయిస్ బేబినే అవుతోంది. ఈ వారం వ‌చ్చిన స్ల‌మ్ డాగ్ హ‌జ్బెండ్ అనే చిన్న సినిమా క‌నీస ప్ర‌భావం కూడా చూప‌లేక‌పోయింది. రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ క‌హాని కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బ్రో కాదంటే బేబి వైపు ప్రేక్ష‌కులు మ‌ళ్లుతున్నారు.

బ్రో హౌస్ ఫుల్స్ ప‌డ్డ  మ‌ల్టీప్లెక్సులు, గ్రూప్ థియేట‌ర్ల‌లో బేబికి టికెట్లు బాగా తెగాయి ఆదివారం. బ్రో ఓవ‌ర్ ఫ్లోస్ దీనికి బాగా క‌లిసొచ్చాయి. ఆదివారం నైట్ షోల‌కు హైద‌రాబాద్‌లో బేబి షోల‌న్నీ దాదాపుగా ఫుల్ ఆక్యుపెన్సీల‌తో న‌డిచాయి. ఆగ‌స్టు రెండో వారంలో జైల‌ర్, భోళా శంక‌ర్ వ‌చ్చే వ‌ర‌కు బేబి సినిమా జోరు కొన‌సాగేలాగే క‌నిపిస్తోంది. అందుకే ఆదివారం మెగాస్టార్ చిరంజీవి అతిథిగా ఇంకో ప్ర‌మోష‌నల్ ఈవెంట్ ప్లాన్ చేసింది చిత్ర బృందం. వంద కోట్ల టార్గెట్‌తో ముందుకు సాగుతున్న బేబి మేక‌ర్స్.. ఆ ల‌క్ష్యాన్ని సాధించేలాగే క‌నిపిస్తున్నారు.