ఏ పార్టీ నుంచైనా ఎంపీగా గెలుస్తా-దిల్ రాజు

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు రాజ‌కీయాల్లోకి వ‌స్తాడ‌ని ఈ మ‌ధ్య కొంచెం గ‌ట్టిగానే ప్ర‌చారం జ‌రుగుతోంది. బ‌లగం సినిమా తర్వాత తెలంగాణ‌లో రాజు ప‌లుకుబ‌డి మ‌రింత పెరిగిన నేప‌థ్యంలో ఆయ‌న రాజ‌కీయ అరంగేట్రం గురించి కొంత చ‌ర్చ జ‌రిగింది. ఈ ప‌రిస్థితుల్లో దిల్ రాజు చేసిన పొలిటిక‌ల్ కామెంట్ ఆస‌క్తి రేకెత్తించింది.

తెలంగాణాలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్‌ కామర్స్ ఎన్నిక‌ల్లో సి.క‌ళ్యాణ్ ప్యానెల్‌తో దిల్ రాజు ప్యానెల్ పోటీ ప‌డుతున్న సంద‌ర్భంగా దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో దిల్ రాజు మాట్లాడుతూ.. తాను ఏ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసినా ఎంపీగా గెలుస్తాన‌ని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ త‌న ప్రాధాన్యం ఎప్ప‌టికీ సినీ రంగానికే అని రాజు తేల్చి చెప్పాడు. సీనియ‌ర్లు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డం వ‌ల్లే ఈసారి తాను ఫిలిం చాంబ‌ర్ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన‌ట్లు రాజు తెలిపాడు.

ఈ ఎన్నిక‌ల పోటీలో ఎలాంటి వివాదాలు లేవ‌ని.. ఫిలిం ఛాంబ‌ర్‌ను బ‌లోపేతం చేయ‌డానికే త‌మ ప్యానెల్ పోటీలోకి వ‌చ్చింద‌ని ఆయ‌న చెప్పారు. గ‌త మూడేళ్ల‌లో సినిమాలు నిర్మించిన వారే ఛాంబ‌ర్లో ఉండాల‌ని తాము కోరితే పాత కార్య‌వ‌ర్గం ఒప్పుకోలేద‌ని.. అందుకే పోటీ అనివార్యం అయింద‌ని.. ఫామ్‌లో ఉన్న నిర్మాత‌లే త‌మ ప్యానెల్లో ఉన్నార‌ని.. నిర్మాత‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డానికి మంచి టీం అవ‌స‌ర‌మ‌ని రాజు అన్నారు.

ఇప్పటికే హోరాహోరీగా సాగిన ఫిలిం ఛాంబర్ ఎన్నిక‌ల‌ ప్రచారానికి తె పడగా ఆదివారం ఉదయం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. నాలుగు గంటలకు కౌంటింగ్‌ నిర్వహించి సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు. ఫిలిం ఛాంబర్లో మొత్తం 1600 మంది సభ్యులుండగా రేపు 900 మంది సభ్యులు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.