బేబి దూకుడుకి బ్రేకులు వేయగలరా

ఊహించని స్థాయిలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న బేబి ఈ రోజుతో రెండు వారాలు పూర్తి చేసుకుంది. పదమూడు రోజుల పాటు ఏ రోజు కోటి షేర్ తగ్గకుండా వసూలు చేసిన చిత్రాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇంత భారీ వర్షాల్లోనూ యూత్ థియేటర్లకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో ఇంట్లో ఉండటం లేదు. హ్యాపీగా రైన్ కోట్లు వేసుకుని బేబీ టికెట్ కౌంటర్ల దగ్గర ప్రత్యక్షమవుతున్నారు. ఇప్పటిదాకా 70 కోట్లకు పైగా గ్రాస్ తో 40 కోట్ల షేర్ కు దగ్గరలో ఉన్న ఈ లవ్ క్లాసిక్  దూకుడుకు అడ్డుకట్ట పడుతుందా లేదానేది రేపు తేలనుంది.

పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్ బ్రో భారీ ఎత్తున విడుదలకు రంగం సిద్ధమయ్యింది. మాములుగా పవర్ స్టార్ సినిమాలకు కనిపించే హడావిడి స్థాయి లేకపోయినా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం జోరుగానే ఉన్నాయి. టాక్ చాలా కీలకంగా మారనుంది. స్క్రీన్లు తక్కువగా అందుబాటులో ఉన్న కొన్ని సెంటర్లలో బేబీని బ్రోతో రీ ప్లేస్ చేశారు. ప్రధాన కేంద్రాల్లో ఎగ్జిబిటర్లు బేబీని కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నారు. మరికొన్ని చోట్ల బ్రోకు వీకెండ్ మొదటి మూడు రోజులు ఇచ్చి తర్వాత పరిస్థితిని బట్టి షోలను ఎలా పంచాలనే నిర్ణయాలు తీసుకోబోతున్నారు.

వాస్తవానికి బేబీ అంత సులభంగా నెమ్మదించేలా అయితే లేదు. కనీసం ఇంకో పది రోజులు స్టడీ హోల్డ్ ఉంటుందని బయ్యర్లు ఆంచనా వేస్తున్నారు. ఒకవేళ బ్రో, భారీ వర్షాలు లేకపోతే మాత్రం వంద కోట్ల క్లబ్బులోకి దర్జాగా అడుగుపెట్టేదన్న విశ్లేషణలో నిజం లేకపోలేదు. అయితే వచ్చే నెల రిలీజులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బేబీ ఫైనల్ రన్ ఆశించిన దానికన్నా కాస్త ముందుగానే రావొచ్చు. వీటి తోడు జూలైలో వరసగా మీద పడ్డ హాలీవుడ్ సరుకు మిషన్ ఇంపాజిబుల్ 7, ఓపెన్ హెయిమర్, బార్బీలు ఏ సెంటర్స్ లో ప్రభావం చూపించాయి. లెక్కల సంగతి పక్కనపెడితే బేబీ ఊచకోత మాత్రం చిన్నది కాదు.