ఇవాళ సాయంత్రం హైదరాబాద్ శిల్ప కళావేదికలో జరిగే బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు జరిగిపోయాయి. నగరాన్ని వర్షం వణికిస్తున్నప్పటికీ ఆ సమయానికి తెరిపినిస్తుందనే ధైర్యం నిర్వాహకుల్లో కనిపిస్తోంది. ఎలాగూ ఇన్ డోర్ లో జరిగే ప్రోగ్రాం కాబట్టి ఇబ్బందులు లేవు కానీ అతిథులు, అభిమానులు వచ్చి పోయే క్రమంలో రోడ్డు మీద ట్రాఫిక్ వల్ల సమస్యలొచ్చే అవకాశాలు లేకపోలేదు. బ్రోకు సంబంధించి యూనిట్ ఇప్పటిదాకా పబ్లిక్ ఈవెంట్ చేయలేదు. సాయి ధరమ్ తేజ్ ఇంటర్వ్యూలు ఇవ్వడం తప్పించి పవన్ నేరుగా మీడియాను కలుసుకోవడం జరగలేదు.
సో సహజంగానే తను ఏం మాట్లాడతాడనే ఆసక్తి కలగడం సహజం. అయితే ఈ కార్యక్రమానికి బండ్ల గణేష్ రావడం దాదాపు కన్ఫర్మ్ అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈశ్వరా పవనేశ్వరా అంటూ ఓ రేంజ్ లో పవర్ స్టార్ ని పొగుడుతూ స్పీచులతోనే ఫాలోయింగ్ సంపాదించుకోవడం బండ్ల గణేష్ కే చెల్లింది. ఒకదశలో ఈ విపరీత ప్రసంగాల వల్లే త్రివిక్రమ్ తనను దూరం పెట్టారనే ప్రచారం జరగడం, దానికి తగ్గట్టే గణేష్ కొన్ని ఇన్ డైరెక్ట్ ట్వీట్లు పెట్టడం కొన్ని నెలల క్రితం జరిగింది. ఇప్పుడు ఈ ఇద్దరూ బ్రో వేడుకలో కలుసుకుంటే వాటికి చెక్ పడిపోయినట్టే.
ఒకవేళ బండ్ల గణేష్ హాజరైతే మాత్రం బ్రో గురించి మాత్రమే కాక పవన్ వ్యక్తిత్వం, జనసేన వారాహి యాత్ర విజయవంతం కావడం లాంటి అంశాలన్నీ ప్రస్తావించకుండా పోరు. పనిలో పని స్టేజి మీద తనకో సినిమా చేసి పెట్టమని అడిగినా ఆశ్చర్యం లేదు. ఊగుతూ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేలా మాట్లాడే బండ్ల గణేష్ చాలా గ్యాప్ తర్వాత పవన్ ని ప్రత్యక్షంగా కలుసుకునే ఛాన్స్ ని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. ఒకవేళ రాలేదంటే మాత్రం అభిమానులకు నిరాశ తప్పదు. మూడు రోజుల్లో విడుదలున్న నేపథ్యంలో బ్రో ఈవెంట్ విశేషాలు కీలకం కానున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates